మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే శంకర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో విజయ తెలంగాణ ఇందిరా మహిళా శక్తి డెయిరీ ఫార్మ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా వెళ్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాలన్నీ వ్యాపారాలలో అభివృద్ధి సాధించాలన్నారు. స్వశక్తితో ఎదిగి మహిళా సాధికారత సాధించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల అందించాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అదినాథ్, విజయ్, అశోక్ రెడ్డి, ప్రతాప్, విశాల్,రాజు మురళీధర్, సత్యనారాయణ, అధికారులు, మహిళ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






