5 August, 2026 | 4:21 PM

చందమామ అందిన వేళ విద్యార్థులు నిత్య పరిశోధకులు కావాలి

23-08-2024 03:16 PM

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి

మంచిర్యాల విజయక్రాంతి : పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచుకొని మరిన్ని విజయాలు మన భారతావనికి అందజేయాలని, విద్యార్థులు నిత్య పరిశోధకులు కావాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్ జే డి) సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సైన్స్ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాలలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆర్జెడి హాజరై జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య కలిసి మాట్లాడారు.

శ్రీహరికోట ద్వారా ఇస్రో గత ఏడాది జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి అదే ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్ ను దింపి ప్రపంచ దేశాలలో అంతరిక్ష ప్రయోగాలలో అత్యుత్తమ స్థానాన్ని నిలబెట్టిందన్నారు. ఈ ఖ్యాతిని కీర్తించేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించాలని తలపెట్టారని తెలియజేశారు. దీనిలో భాగంగానే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించబడుతుందని వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలియజేశారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య మాట్లాడుతూ భారత్ ఆన్ థ మూన్ (bharathonthemoon) అనే పోర్టల్ ద్వారా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలను పొందుపరచాలని, విద్యార్థులకు అంతరిక్షం పై ఆసక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇస్రో నుంచి అభినందన సర్టిఫికెట్లు విద్యార్థులు పొందేలా ప్రోత్సహించాలని కోరారు. అనంతరం జిల్లా సైన్స్ కేంద్రాన్ని సందర్శించి సైన్స్ కేంద్రం, జిజ్ఞాస  సంచార ప్రయోగశాల ద్వారా  నిర్వహించబడుతున్న కార్యక్రమాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, మండల విద్యాధికారి జాడి పోచయ్య, సెక్టోరియల్ అధికారి చౌదరి, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధా,  ఉపాధ్యాయ బృందము ,జిజ్ఞాస సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.