28 May, 2026 | 1:55 AM

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి

28-05-2026 12:21 AM

అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

ఆదిలాబాద్, మే 27 (విజయక్రాంతి) : మహిళా ఉద్యోగులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ మహిళా వారోత్సవాలలో భాగంగా బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో మహిళా సంక్షేమ శాఖ, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించని ’పోష్ యాక్ట్ పై ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల హక్కులు, రక్షణ మార్గదర్శకాలతో పోష్ యాక్ట్ ప్రత్యేక అవగాహన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కార్యాలయాల్లో మహిళా ఉద్యోగు లకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం చట్టప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేసే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో తప్పనిసరిగా ’అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఒకవేళ ఏ చిన్న కార్యాలయంలోనైనా ఈ కమిటీ అందుబాటులో లేకపోతే, జిల్లా స్థాయిలోని లోకల్ కంప్లైంట్ కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా విచారణలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ విభాగాలు కేంద్ర ప్రభుత్వ ’షీ-బాక్స్’ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయని, ఇంకా పెండింగ్లో ఉన్న శాఖలు ఏవైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కమిటీల పనితీరును రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని వివరించారు.

మహిళా ఉద్యోగులకు తమ హక్కులపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దురదృష్టవశాత్తూ ఏవైనా వేధింపులు ఎదురైతే ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేసేలా ప్రతి ఆరోగ్య కేంద్రం, ఎంపీడీవో, ఏంఆర్సి కార్యాలయం, అన్ని జిల్లా స్థాయి విభాగాల్లోని స్పష్టంగా కనిపించే ప్రదేశాలలో ఫ్లెక్సీలు లేదా కలర్ పోస్టర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. దీనిపై తీసుకున్న చర్యల తాలూకు నివేదికను త్వరలోనే జిల్లా సంక్షేమ అధికారికి సమర్పించాలన్నారు.

బాధితులు అధైర్యపడకుండా టోల్ ఫ్రీ నెంబర్ 181, షీ-బాక్స్ పోర్టల్ లేదా నేరుగా రాతపూర్వక ఫిర్యాదుల ద్వారా తమ సమస్యలను కమిటీల దృష్టికి తీసుకురావచ్చని ఈ సదస్సు ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవి,డిఆర్డీఓ రవీందర్, వైద్యాధికారి నరేందర్, డివైఎస్‌ఓ శ్రీనివాస్, డిఎస్సీడివో సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, ఎల్సి కమిటి చైర్ పర్సన్ భవన సింగ్, కోఆర్డినేటర్ యశోద, వివిధ శాఖల అధికారులు, ఇంటర్నల్ కమిటి మెంబెర్స్, మహిళా ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.