మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మార్చి 11(విజయక్రాంతి): మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు రావడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించి స్వయం సమృద్ధిని సాధించవచ్చని తెలిపారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, రుణ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలపర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఆర్థిక స్వతంత్రం సాధించాలని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళకు,పురుషులకు గతంలో చాలా వ్యత్యాసాలు ఉండేవని, ఓటు హక్కు కూడా లేదని, వీటిపై చాలామంది మహిళల పోరాటం వల్ల మహిళలకు హక్కులు కల్పించబడ్డాన్నారు. గతంలో మహిళా కమిషనర్ గా ఉండి పురుషులకు మహిళల హక్కుపై అవగాహన కల్పించినట్లు గుర్తు చేశారు.మహిళలు బలహీనులు కాదు ,బలవంతులన్నారు. మహిళలు అవకాశాలను అందింపుచ్చుకోవాలన్నారు. మహిళలకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు.మహిళలకు మహిళాచట్టాల పై అవగాహన కల్గి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మి, డి డబ్ల్యు హేమ భార్గవి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి, షెడ్యూల్ కులాల నిర్వహణ అధికారి, విజయలక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు మహిళలు మహిళ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




