26 June, 2026 | 2:38 PM

అద్భుత జైన దేవాలయం

10-08-2025 12:37 AM

కొల్చారంలో కల్యాణి చాళుక్యుల కాలం నాటి విగ్రహం

అనార్య జాతుల ఉద్ధరణ కోసం ఉద్భవించినవే జైన, బౌద్ధ మతాలు. సింధూ నాగరికతకు చెందిన మత విశ్వాసాల నుంచే జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయని చరిత్రకారులు చెబుతుంటారు. జైన మత ప్ర చారకులను తీర్థంకరులు అంటారు. దీని అర్థం మార్గదర్శకులు అని చెబుతుంటారు. అనుస్తుతి అనేది జైనులకు అతి పవిత్రమైన సాహి త్యం. దీని ప్రకారం జైన తీర్థంకరులు 24 మం ది.

మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 22వ తీర్థంకరుడు అరిష్టనేమి గురించి వేదా ల్లో ప్రస్తావన ఉంది. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు చారిత్రకంగా జైనమత స్థాపకుడని చెబుతుంటారు. పార్శ్వనాథుడు కాశీదేశ రాజైన అశ్వసేన, వామలకు జన్మించాడు. ఇత డు 23వ తీర్థంకరుడు.

జైనమత సిద్ధాంతాలైన సత్యం, అహింస, ఆస్తేయం(ఆస్తి ఉండరాదు), అపరిగ్రహం (దొంగతనం చేయరాదు) లాంటి వాటిని ప్రబోధించాడు. అలాంటి 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆలయం మెదక్ జిల్లా కొల్చారం గ్రామంలో కొలువై ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 85 కిలోమీటర్ల దూరంలో, మెదక్ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. 

ఎక్కడ చూసినా పురాతన ఆనవాళ్లే

వివిధ రాజవంశాలకు చెందిన రాజులు పరిపాలించిన కొల్చారం గ్రామంలో ఎక్కడ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. కాకతీయుల కాలం నుంచి నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి. కొల్చారంలో 1,008 విఘ్న హర్నేశ్వర్ పార్శ్వనాథ దిగంబర్ జైన అతిశయ క్షేత్ర దేవాలయాన్ని నిర్మించారు.

ఇక్కడి మూర్తి స్వయంభు అంటే తనకు తానుగా భూమి నుంచి బయటకి వచ్చినవారు అని అర్థం. 1983 సంవత్సరంలో ఊరి చివరలో ఉన్న కొన్ని గుడిసెలు అగ్నికి ఆహూతయ్యి, బూడిద కుప్పగా మారాయి. ప్రభుత్వం ఆ బూడిద కుప్పలు తొలగించి, పేదలకు ఇళ్లు కట్టే క్రమంలో తీసిన పునాదుల్లో ఈ దేవాలయ మూర్తి ఏడుతలల పాముతో కప్పబడిన శిల్పంలోని కొంత భాగం మొదట బయట పడింది. దాన్ని తీసే క్రమములో ఆ స్థలాన్ని జాగ్రత్తగా తవ్వారు. అప్పుడు ఈ  ఏడుతలల సర్ప పడగల నీడలో నిలబడి ఉన్న పార్శ్వనాథ దిగంబర జైన విగ్రహం బయటపడింది.

లా నిలబడి ఉన్న పార్శ్వనాథ జైన విగ్రహం చాలా అరుదు. ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కల్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా చరిత్రకారులు గుర్తించారు. జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని త్రిభువన రాజు చెక్కించినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. అలా నిలబడి ఉన్న భంగిమలో ఉన్న జైన విగ్రహం భారతదేశములో కర్నాటకలోని శ్రావణ బెలగోళ ఉన్న గోమఠేశ్వర్ లేదా బాహుబలి విగ్రహం తరవాత పెద్దదీ, రెండవది.

నల్లసరం రాయిలో చెక్కిన విగ్రహం ఇదొక్కటే. అందుకే ఈ క్షేత్రం జైనులకి ఎంతో ముఖ్యమైనది. ఈ విగ్రహం నల్లని రాయితో చెక్కబడి, పదకొండు అడుగుల మూడు అంగుళాల (11’ 3‘) పొడవు ఉంది. దాదాపు 20-25 మంది భూమి నుంచి, బయటకు తీశారు. అలా దిగంబర జైనులకి ఆరాధ్య దైవమైన పార్శ్వనాథుడి విగ్రహం బయటపడింది. 

అద్భుతంగా ఆలయ నిర్మాణం

కొల్చారంలో పార్శ్వనాథుడి విగ్రహం బయటపడిన విషయాన్ని హైదరాబాద్ జైన సమాజ్ వారికి కబురందించారు. వారు ఆ విగ్రహాన్ని హైదరాబాద్‌కి తరలించాలని చూశారు. ఇక్కడి గ్రామస్థులకి ఆ విగ్రహం అరుదైనదనీ, తమ ఊరిలోనే ప్రతిష్ఠిస్తే వచ్చే యాత్రికుల వల్ల తమ గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, తమలో కొంతమందికి పరోక్షంగా జీవన ఉపాధి దొరుకుతుందని పట్టుబట్టారు.

గ్రామ అభివృద్ధికి కాస్త విరాళం ఇస్తామని నచ్చచెప్పినా, తమ దిగంబర జైన ఆచారాలు అక్కడి వారికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు అని విన్నవించినా ఆ గ్రామస్థులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ విగ్రహాన్ని 1984 నుంచి 1990ల చివరి వరకు స్థానికుల ఆధీనంలో ఉంది. గ్రామస్థులు ఆ విగ్రహాన్ని ’గ్రామ దేవత’గా భావించారు. చివరికి మెదక్  ప్రధాన రహదారి ప్రక్కన దాదాపు రెండున్నర ఎకరాల స్థలంలో, చుట్టూ కాంపౌండ్ ఉన్న దేవాలయం నిర్మాణం జరిగింది.

ఆ తరవాత చాలా ఆలోచనల నిర్ణయాల వల్ల అన్ని వసతులు గల పదిగదుల సత్రంతో పాత, ఆధునిక లక్షణాలతో వెనకవైపున చిన్న గుట్టల ముందు, పచ్చని పరిసరాల మధ్య అందముగా నిర్మించబడింది. 2003లో ఈ దేవాలయం నిర్మాణం పూర్తయ్యింది. నల్లని, ఆకర్షణీయమైన ఈ మూర్తిని చూడటానికి అన్నిమతాల, కులాల యాత్రికులూ వస్తారు. ఈ దేవాలయ ప్రారంభోత్సవం పంచ కల్యాణిక ప్రతిష్ఠా మహోత్సవాన్ని 10 మార్చి 2003 నుంచి 16 మార్చి 2003 వరకూ చాలా గొప్పగా, భారీగా, ఎన్నో కార్యక్రమాలతో చేశారు. కోటిన్నర రూపాయల విరాళం ఇచ్చి ఒక జైన మతస్థుడు తొలి పూజని నిర్వహించారు.

పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు ఎక్కువగా ఈ దేవాలయ సందర్శనకు వస్తుంటారు.