10-08-2025 12:34:24 AM
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఎర్రబెల్లి వీరరాఘవరావు 1936లో నిర్మించిన కల్లెడ గడి నాటి రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. ఏడెకరాల సువిశాల విస్తీర్ణంలో 40 అడుగుల ఎత్తులో భవనాలు, 20 అడుగుల ఎత్తు ప్రహరితో, 76 గదులతో ఈ గడిని నిర్మించారు. నిజాం పరిపాలనాకాలంలో ఎర్రబెల్లి వంశీయుల అధీనంలో ఈ ప్రాంతం ఉండేది. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా శత్రుదుర్భేద్యమైన గడిని నిర్మించారు.
ప్రత్యేకంగా సున్నం డంగుతో మట్టి ఇటుకలతో, పాలాస్త్రి విధానంలో స్లాబులు నిర్మించారు. రంగూన్ దేశం నుంచి రంగులు, బర్మా నుంచి ప్రత్యేకంగా టేకు కలప తెప్పించి గడి నిర్మాణం చేపట్టారు. దీంతో భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గడి లోపల పచ్చటి ఉద్యానవనం, రెండు ప్రధాన ద్వారాలు, పంచాయతీలు, సమావేశాలు నిర్వహించడానికి నిర్మించిన పెద్ద హాళ్లు నాటి రాచరికానికి తార్కాణంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిర్మించిన గడిలు చాలావరకు కాలగర్భంలో కలిసిపోగా, కల్లెడలో మాత్రం ఎర్రబెల్లి వంశీయులు చారిత్రకమైన గడిని సంరక్షిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో రాచరిక పరిపాలన, నాటి ఇతివృత్తంతో నిర్మించిన పలు చిత్రాలకు కల్లెడ గడి కేంద్రంగా నిలిచింది. రవితేజ, ఆర్ నారాయణమూర్తి, నాని తీసిన సినిమాలు నీకోసం, ఎంసీఏ, వీర తెలంగాణ ఇక్కడే చిత్రించారు.
ఎర్రబెల్లి వంశీయుల్లో ఒకరైన రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో కల్లెడ, పర్వతగిరిలో ఏర్పాటు చేసిన ఆర్టీఎఫ్ విద్యాసంస్థను 2003 నుంచి కొంతకాలం పాటు ఈ గడిని విద్యాలయంగా వినియోగించారు. ఆ సమయంలో విద్యాపరంగా, క్రీడాపరంగా కల్లెడ గడిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆర్చరీ క్రీడా శిక్షణాకేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా క్రీడాకారులను తీర్చిదిద్దారు.
ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారిణి వర్ధినేని ప్రణీత ఒలంపిక్ క్రీడలో భారతదేశం తరఫున పాల్గొని కల్లెడ గడి చరిత్రను ప్రపంచానికి చాటారు. ఇంతటి ఖ్యాతి గడిచిన కల్లెడ గడి విశిష్టతను అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేయడం విశేషం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కల్లెడ గడిని రాష్ట్ర వారసత్వ సంపదగా గుర్తించింది.
దీంతో కల్లెడ గడిని నిర్మించిన వీర రాఘవరావు మునిమనుమడు ఎర్రబెల్లి ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో నాటి రాచరిక పాలనకు దర్పంగా నిలుస్తున్న కల్లెడ గడి పర్యాటక కేంద్రంగా మారనుంది.