calender_icon.png 14 August, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీతో యువతకు స్ఫూర్తి

10-08-2025 01:04:08 AM

మణుగూరు, ఆగస్టు ౯ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఏదో ఒక నూతన ఆలోచన ద్వారా మన చుట్టూ ఉన్న సమాజా నికి మేలు చేయాలని అనుకుంటారు. అలా అనుకునే వారిలో చాలా తక్కువశాతం మంది మాత్రమే వారి ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చి సమాజాన్ని ప్రభావితం చేస్తారు. అలాంటి ఓ విద్యార్థినే మణుగూరు మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన అడపా స్ఫూర్తి.

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకు ఆమె నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐలో ఏటీసీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని స్ఫూర్తి.. అధ్యాపకులు రాజేందర్ ప్రోత్సాహంతో పర్యావరణహిత ఎకోవారియర్ (ఈవీ )వాహనాన్ని తయారు చేసి అందర్నీ అబ్బురపరచి ప్రశంసలు అందుకుంటున్నారు.

వినూత్న ఆలోచన.. విభిన్న ఆవిష్కరణ

యుగయుగాలుగా మనిషి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతోంది. ప్రకృతికి తాను చేసిన చేటును తలుచుకొని మారే ప్రయత్నాలూ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికిల్స్ పురుడు పోసుకున్నాయి. పేరుమోసిన సంస్థలన్నీ ఎలాంటి కాలుష్యం వెదజల్లని వాహనాల తయారీలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో ఏజెన్సీ  ప్రాంతానికి చెందిన విద్యార్థి స్ఫూర్తి కూడా పర్యావరణహితం కోరి వినూత్న ఆవిష్కరణను ఆలోచించారు.

చివరకు బ్యాటరీ సాయంతో నడిచే వాహనాన్ని తయారు చేయాలని సంకల్పించింది. దాని కోసం నడుం బిగించారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనా.. పట్టు వీడనీ విక్రమార్కుడిలా తన ప్రతిభతో పాటు కుటుంబసభ్యుల సహకారంతో ‘ఎకో వారియర్’ పేరుతో వాహనాన్ని రూపొందించి, అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. 

ఈవీ ఆవిష్కరణ కిరీటం ఆమెదే

చిన్ననాటి నుండి చదువులో రాణిస్తూనే స్పూర్తి, తన తండ్రి ప్రవీణ్ వాహన మెకానిక్ పనితీరును గమనించి, అన్న ఎలక్ట్రీషియన్ కావడంతో  టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంది. ప్రతి పనిని ఆసక్తిగా గమనిస్తూ బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రికల్ వాహనాన్ని ఆవిష్కరించి తన ప్రతిభను ప్రదర్శించింది. తాను తయారు చేసిన వాహనానికి ‘ఎకో వారియర్’ అని నామకరణ చేసిన స్ఫూర్తి ఆ వాహన సృష్టికర్తగా కీర్తి కిరీటాన్ని ధరించారు. 

సంకల్పం, సాంకేతికతో..

తక్కువ ధరలోనే పర్యావరణహిత వాహనాన్ని తయారు చేయాలని స్ఫూర్తి సంకల్పించింది. అందుకోసం ప్లాస్టిక్ వ్యర్థాలను, పాత ఇనుప దుకాణంలో వస్తువులను సేకరించింది. రూ 40 వేల ఖర్చుతో ఈవీవాహనాన్ని రూపొందించింది. వాహనానికి నాలుగు బ్యా టరీలను, ఒక మోటార్ ఏర్పాటు చేసి నడిచేలా చేసింది. నూతన ఆలోచనలతో స్ఫూర్తి తయారు చేసిన వాహనం మణుగూరు పట్టణంలోని  వీధులపై రయ్ రయ్‌మంటూ పరుగులు పెడుతోంది.

కారును పోలిన ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ప్రతిభావంతమైన కళాదీప్తిగా.. స్ఫూర్తి మణుగూరు కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారని,  ఈ విద్యార్థిని అధ్యాపకులు, పట్టణ వాసులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈవీ వాహన తయారీతో యువతకు స్ఫూర్తి ప్రేరణగా నిలుస్తున్నారు.

ప్రభుత్వం సహకారం అందించాలి

ఆర్థిక స్తోమత లేకపోయినా తన ప్రయత్నానికి తల్లిదండ్రుల ప్రోత్సా హం, అన్నయ్య సహకరంతోనే తాను ఈవీ  వాహనాన్ని తయారు చేశానని విజయక్రాంతికి స్ఫూర్తి తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే కాలుష్యం లేని మరెన్నో ఎలక్ట్రికల్ వాహనాలను రూపొందిస్తామని చెప్పారు. ఎవరైనా ఈవీ వాహనం కావాలంటే రెండు నెలల్లో తయారు చేసి ఇస్తామన్నారు. పర్యావరణ హిత వాహనాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలన్నారు.

 అడపా స్ఫూర్తి, ఎకో వారియర్ రూపకర్త