calender_icon.png 22 August, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న మాటల చెట్టు

17-06-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం, జంటనగరాల సంయుక్త నిర్వహణలో శ్రీమతి గడ్డం సులోచన రచించిన ‘మాటల చెట్టు’ కవితా సంపుటి ఆవిష్కరణ 22వ తేదీన హైదరాబాద్, రవీంద్రభారతిలో జరగనుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు అధ్యక్షత వహించే ఈ సమావేశానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా॥ మామిడి హరికృష్ణ విశిష్ట అతిథిగా హాజరవుతారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా॥ నాళేశ్వరం శంకరం, ప్రముఖ కవి డా॥ ఉదారి నారాయణ, తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల ప్రధాన కార్యదర్శి డా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్ ఆత్మీయ అతిథులుగా హాజరవనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

30న నీ స్నేహం కోసం

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘కామన్ డయాస్’ (సాహిత్యం, విద్య, సేవ, జర్నలిజం) రవ్వలకొండ విశ్వబ్రాహ్మణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 30వ తేదీన హైదరాబాద్, రవీంద్రభారతిలో తంగెళ్లపల్లి కనకాచారి ‘నీ స్నేహం కోసం’ కథానికల సంపుటి ఆవిష్కరణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, ఐఏఎస్ (రి) డా॥ కె.వి.రమణాచారి ముఖ్యఅతిథిగా పాల్గొంటుండగా, భీమన్న సాహితీనిధి వ్యవస్థాపకులు శ్రీమతి హైమవతి భీమన్న ‘కృతి స్వీకర్త’గా వ్యవహరిస్తారు. 

తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా॥ మామిడి హరికృష్ణ, ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞశర్మ, ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి శైలజామిత్ర అతిథులుగా హాజరవనున్నారు. కాగా, గ్రంథాలయ ఉద్యమనేత, సాహితీకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

19న మన కల నిజం

నాగర్‌కర్నూల్‌కు చెందిన సి.యన్.ఆర్. విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో చింతలపల్లి నిర్మలాదేవి  నారాయణరావు ‘జీవన సాఫల్య పురస్కారం 2024’ను నాగవరం బాల్‌రాంకు ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్, తిలక్‌రోడ్‌లోని ‘తెలంగాణ సారస్వత పరిషత్’ సమావేశ మందిరంలో 19వ తేదీన జరిగే ఈ సభలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ‘మన కల నిజం’ పుస్తకావిష్కరణ కూడా జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. విశ్రాంత అధ్యాపకులు చింతలపల్లి భాస్కరరావు సభాధ్యక్షులుగా వ్యవహరించే ఈ సభకు వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్ ప్రొ॥ ఘంటా చక్రపాణి విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రత్యేక అతిథిగా, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జుర్రు చెన్నయ్య గౌరవ అతిథిగా పాల్గొంటారు.