calender_icon.png 23 August, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయాలు!

16-06-2024 12:05:00 AM

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. రైతు బజార్లలో ఏ కూరగాయ ధర కూడా కిలో రూ.60-- తక్కువ లేదు. బహిరంగ మార్కెల్లో ఇంకా ఎక్కువే. ఒకప్పుడు కిలో రూ.20కి దొరికే టమాటా, ఉల్లి లాంటివయితే కిలో 50 రూపాయలకు చేరున్నాయి. గతంలో వందకు వచ్చే కూరగాయలు ఇప్పుడు 200 రూపాయలు పెట్టినా రావడం లేదు. ఫలితంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఎండాకాలం  కూరగాయల ధరలు పెరగడం, వానాకాలం రాగానే తగ్గడం జరుగుతుంటుంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. ఎండాకాలంలో పెరిగిన ధరలు ఇప్పటికీ దిగి రాలేదు సరికదా, కొండెక్కి కూచున్నాయి.

దీంతో ‘ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు’ అని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ జనాభా అవసరాలనుబట్టి ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా ప్రస్తుతం 19.54 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే, దాదాపు సగం ఉత్పత్తి తగ్గిపోయింది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతుంటే అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. జంటనగరాల చుట్టుపక్కల గతంలో ఎక్కువగా ఆకుకూరలతోపాటు ఇతర కూరగాయలను పండించేవారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఈ భూములన్నీ ఇప్పుడు వాణిజ్య భూములుగా మారిపోయాయి.

ఫలితంగా శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే కూరగాయలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో కోటికి పైగా ఉన్న నగర జనాభా అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంవత్సరం పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోయింది. పండించినవి అక్కడి అవసరాలకే చాలడం లేదు. అదీకాక కూరగాయలు నిల్వ ఉండేవి కావు. త్వరగా కుళ్లి పోవడం, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా వాటి ధరలు పెరిగిపోతాయి. గతంలో ఉల్లిపాయలు కర్నూలు, బళ్లారితోపాటు మహారాష్ట్రనుంచి ఎక్కువగా నగరానికి వచ్చేది. గతంలో రోజూ 8 వేల టన్నుల ఉల్లి వస్తే ఇప్పుడు 5 వేల క్వింటాళ్లయినా రావడం లేదని వ్యాపారులు అంటున్నారు.

సప్లు తగ్గినప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ధరలు పెరిగే అవకాశముంటుందనేది వారి వాదన. ధరలు పెరగడం వల్ల తమ వ్యాపారాలపైనా ప్రభావం పడుతుందని అంటున్నారు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. అది ఎంతమేరకు కార్యరూపం దాల్చిందో తెలియదు కానీ, ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వమూ వ్యసాయానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తోంది. అందులో కూరగాయల సాగు ఉందో లేదో తెలియదు.

ఒక్క కూరగాయలే కాదు ఉప్పు, పప్పు, వంటనూనెలుసహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి.  డీజిలు ధరలతో రవాణా చార్జీలు, ఫలితంగా సరకుల ధరలూ పెరిగాయని మార్కెట్  వర్గాలు అంటున్నాయి. అది కొంతమేరకు నిజమే కావచ్చు కానీ, ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయక పోవడం దీనికి ప్రధాన కారణం. గతంలో రేషన్ దుకాణాల్లో  బియ్యంతోపాటు చక్కెర, కందిపప్పు లాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. బియ్యం దొడ్డువి కావడంతో కార్డులున్నప్పటికీ సగం మందే తీసుకొంటున్నారు. పింఛను లాంటి వాటికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడుతోంది. జనాభా పెరుగుతోంది కానీ, ఆ దామాషాలో నిత్యావసరాల ఉత్పత్తి పెరగడం లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ప్రతి నెలా వంటింటి ఖర్చు పెరగడంతో గృహిణులకు  శిరోభారం తప్పడం లేదు. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం సమస్యకు పరిష్కారం చూపక పోతే సామాన్యుడి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందేమో!