calender_icon.png 16 February, 2026 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషా పరిజ్ఞానంతోనే ఆలోచనా విధానంలో మార్పు

16-02-2026 08:26:40 PM

- జాతీయ స్థాయి కార్యశాల

కామారెడ్డి,(విజయక్రాంతి): పదాలు ప్రపంచాన్ని మారుస్తాయని, సరైన పదజాలం వ్యక్తి యొక్క ఆలోచనా దృక్పథాన్ని  ప్రభావితం చేస్తుందని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అన్నారు. సోమవారం కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "వర్డ్స్ దట్ షేప్ ద వరల్డ్: హౌ వొకాబులరీ ఎఫెక్ట్స్ పర్సెప్షన్"  అనే అంశంపై ఒకరోజు జాతీయ స్థాయి కార్యశాల ఘనంగా నిర్వహించారు. కళాశాల సమావేశ మందిరంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం విద్యార్థులకు అత్యవసరమన్నారు. కంప్యూటర్ రంగంలోను, ఇతర వృత్తిపరమైన అవకాశాల్లోనూ ఆంగ్ల భాష ప్రావీణ్యం ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, ఈ సదస్సు ద్వారా పొందిన జ్ఞానాన్ని విద్యార్థులు లక్ష్య సాధనలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఆంగ్ల ఆచార్యులు డాక్టర్ బి.బ్రహ్మానందచారి ముఖ్య అతిథిగా హాజరై, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణాత్మక ఉపన్యాసం చేశారు.

పదజాలం కేవలం మాట్లాడటానికే కాకుండా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని, సమాజం పట్ల మనకున్న అవగాహనను ఎలా మారుస్తుందో ఉదాహరణలతో వివరించారు. ఆంగ్ల భాషా కౌశలాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. కిష్టయ్య మాట్లాడుతూ... ఏ రంగంలో రాణించాలన్నా భాషా పరిజ్ఞానం పునాది వంటిదని, భాషాభివృద్ధి ద్వారానే పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ డాక్టర్ బి.బ్రహ్మానంద చారిని ప్రిన్సిపల్, అధ్యాపక బృందం శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ముందుగా ఆంగ్ల విభాగం అధిపతి డాక్టర్ పి.విశ్వప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు అంకం జయప్రకాష్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, అధ్యాపకులు పర్వీన్ ఫాతిమా,సత్యనారాయణ,ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్,అఫ్రీన్ ఫాతిమా, ఆరే శ్రీలత,అనిల్ కృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.