34 లక్షలు హాంఫట్!
n సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విశ్రాంత ఉద్యోగి
n సీబీఐ అధికారులమంటూ ఫోన్..
n భయబ్రాంతులకు గురిచేసి బ్యాంకు ఖాతా ఖాళీ
n మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : పోలీసులు ఎన్నిసార్లు తగిన జాగ్రత్తలు చెప్పినా నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మరొకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సీబీఐ అధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసి బురిడీ కొట్టించారు. శనివారం నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగిని భయబ్రాంతులకు గురిచేసి రూ.34 లక్షలు కాజేశారు. బాధితుడికి ఫోన్ చేసి.. మీ బ్యాంకు ఖాతా నుంచి భారీగా లావాదేవీలు జరిగాయని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు నగదు చెల్లింపులు చేశారని సీబీఐ అధికారినంటూ ఒకడు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించాడు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదైందని, వెంటనే ఖాతాలో ఉన్న నగదును తాము చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేయాలన్నారు.
విచారణ అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల్లో తిరిగి ఆ విశ్రాంత ఉద్యోగి ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మించాడు. దీంతో భయాందోళనకు గురైన విశ్రాంత ఉద్యోగి వారు చెప్పినట్లుగా ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ మోసాలు, నేరగాళ్లపై అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. గత వారం ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లు ముంబాయి సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ నగరానికి చెందిన ఒక వైద్యుడిని మోసం చేసి రూ.12.75 లక్షలు దోచుకున్నారు.






