22 August, 2026 | 3:09 PM

మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి

22-08-2026 02:38 PM

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి,

అనుకున్న గడువులోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

పనులను పరిశీలించిన కలెక్టర్

గణపురం,ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మైలారం యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(Young India School ) నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం  మండలంలోని మైలారం గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫుటింగ్, బేస్ కాంక్రీట్ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు. నాలుగు అకాడమిక్ బ్లాకులు, సీనియర్, జూనియర్ డార్మిటరీలు, వంటశాల, భోజనశాల, పరిపాలనా భవనాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు.

నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. కాంక్రీట్ గోడల నిర్మాణంలో షియర్ వాల్ సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని చెట్లను తొలగించరాదని, అత్యవసరమైతే అటవీ శాఖ అనుమతులు పొందిన తర్వాతే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పాఠశాలలో 2,640 మంది విద్యార్థులు, 300 మంది సిబ్బందికి వసతి కల్పించనున్న నేపథ్యంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల భూగర్భ నీటి ట్యాంక్, 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల పైభాగపు ట్యాంక్ నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందేలా నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిజిఈడబ్ల్యూఐడిసి ఈఈ అరుణ్ కుమార్, తహసీల్దార్  రాజేశ్వరరావు, ఏఈ జీవన్, సర్పంచ్ సమ్మయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.