న్యాయవాదుల సంక్షేమానికి కృషి
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సాముల రాంరెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారాలతో కోర్టులు అభివృద్ధి
హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు నారపరాజు శ్రీనివాసరావు
హుజూర్ నగర్, ఏప్రిల్ 22: తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో తనను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించిన న్యాయవాదులకు తను రుణపడి ఉంటానని వారి సంక్షేమానికి తన శాయశక్తులా కృషి చేస్తానని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగిల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుగా ఉన్న హుజూర్ నగర్ కు ఇప్పటికే అదనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అధనపు జిల్లా జడ్జి కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మంజూరు చేయించడంలో అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సాముల రాంరెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి పరిచారని తద్వారా ఇక్కడి న్యాయవాదులకు వృత్తిపరమైన పని దొరికిందని ఆయన వివరించారు.
అలాగే మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో సాముల రాంరెడ్డి మరొక రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను కూడా మంజూరి చేయించారని వారిద్దరి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో వాటిని ప్రారంభించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. శిథిలావస్థలో ఉండి కూలిపోయిన పాత కోర్టు భవన స్థానంలో 3 కోట్ల 30 లక్షల రూపాయలతో అధునాతనమైన కోర్టు భవనాన్ని నిర్మించిన ఘనత మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి సాముల రాంరెడ్డికి దక్కిందన్నారు.
అంతే కాకుండా 8 కోర్టులకు సరిపోను న్యాయస్థాన భవన సముదాయం, న్యాయమూర్తుల నివాస సముదాయాల కొరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించటం సంతోషదాయకమన్నారు. వారి ఇరువురి ఆశీస్సులతో వారి సహాయ సహకారాలతో త్వరలోనే నూతన నిర్మాణాలకు తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. న్యాయవాదుల వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాననీ, న్యాయమూర్తులు, న్యాయవాదులకు మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా తను కృషి చేస్తానని పేర్కొన్నారు.






