భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): 56వ ప్రపంచ ధరిత్రి దినోత్సవంనుపురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాసుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో బుధవారం, అవర్ ఫ్లవర్, అవర్ ప్లానెట్,2026 థీమ్ తో ఘనంగా విద్యార్థులకు రకరకాల కార్యక్రమాలు, వివిధ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యము వలన గ్లోబల్ వార్మింగ్ పెరిగి భూమి వేడెక్కుతుందని, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన వాతావరణ మార్పులకు కారణమవుతుందని భూ కాలుష్యం వలన మానవజాతికి మున్ముందు ముప్పు పెరుగుతుందని,వీటన్నింటినీ నివారించడానికి పునరుద్ధరించబడే వనరులను ఎక్కువగా వినియోగించాలని, చెట్లను పెంచాలని, భూ కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలిపారు.
ధరిత్రీ దినోత్సవం గురించి విద్యార్థినులకు అవగాహన కలిగించుటకు సేవ్ ఎర్త్, సేవ్ ఎనర్జీ,అంశం పైన వ్యాస రచన పోటీలు, చిత్రలేఖన పోటీలు, నినాదాల పోటీలు, పదజాల పోటీలు, పద్య రచన, నాటిక ప్రదర్శన, పాటల పోటీలు, నృత్య ప్రదర్శనలు, విత్తన బంతుల తయారీ, బట్ట సంచుల పంపిణీ, మానవహారం, చెట్లు నాటడం, ర్యాలీ, ప్రకృతి ప్రతిజ్ఞ వంటి వినూత్న పోటీలు, కార్యక్రమాలను నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. భూ రక్షణ అందరి బాధ్యత, చిన్నతనం నుండి ప్రకృతి పట్ల ప్రేమను కలిగి ఉన్నచో మున్ముందు భూమిని కాపాడుకోగలుగుతారని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మోతే స్వప్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ,కో ఫ్రెండ్లీ టీచర్ కె.లక్ష్మీ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






