నిబద్ధతతో పనిచేస్తే ప్రత్యేక గుర్తింపు
- ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి
- హెచ్ఎం పద్మ ఉద్యోగ విరమణకు హాజరు
- నెలాఖరులోపు ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డ్స్, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా కృషి
కోహెడ: నిబద్దతతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఎంమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సాంబరాజు పద్మ ఉద్యోగ విరమణ కార్యక్రమం స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో పిఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరైయి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లాలో మండల రిసోర్స్ పర్సన్ లుగా ఇరువురం కలిసి పనిచేసినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ గాను, జిసిడిఓ గా, పాఠ్య పుస్తక రచయితగా పనిచేయడం ఆమె వృత్తి నిబద్ధతకు ఆదర్శం అన్నారు.
అలాగే ఉపాధ్యాయులందరికీ ఈ నెలాఖరు వరకు హెల్త్ కార్డ్స్ వస్తాయని, పెన్షనర్ల బకాయిల కోసం ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయించిందని అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాలుగైదు నెలలలో చెల్లించడం జరుగుతుందని హామీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నామని గతంలో కంటే ఎక్కువ ఫిట్మెంట్ తో మెరుగైన పిఆర్సి ని ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 36 సంవత్సరాల ఉద్యోగంలో ఎలాంటి రీమార్క్ లేదన్నారు. ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ఈ సందర్బంగా హెచ్ఎం పద్మ రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. వృత్తి నిబద్ధతతో పని చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.






