డిమాండ్ తగ్గేదేలే..

01-05-2024 12:50:40 AM

ధర పెరిగిన బంగారంపై తగ్గని మోజు

మార్చి త్రైమాసికంలో రూ.75,000 కోట్ల పసిడిని  కొనేశారు

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 30: పుత్తడి ధర విపరీతంగా పెరిగినా భారతీయులకు ఈ లోహంపై మోజు పెరుగుతూనే ఉన్నది. బంగారం ధర చరిత్రాత్మక గరిష్ఠస్థాయిని చేరినప్పటికీ, ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 136.6 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే ఈ డిమాండ్ 8 శాతం వృద్ధిచెందింది. రిజర్వ్‌బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా డిమాండ్ పెరుగుదలకు కారణమని కౌన్సిల్ తెలిపింది. ముగిసిన జనవరి విలువరీత్యా బంగారానికి డిమాండ్ 20 శాతం వృద్ధిచెంది రూ.75,470 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ త్రైమాసికంలో పసిడి ధర సగటు పెరుగుదల 11 శాతం ఉన్నదని పేర్కొంది. 

ఈ ఏడాది 700 టన్నులకు డిమాండ్

ప్రస్తుత ఏడాది భారత్‌లో బంగారం డిమాండ్ 700 టన్నుల శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్టు జైన్ చెప్పా రు. ధరలు మరింత పెరిగితే ఈ శ్రేణిలో దిగువన (700 టన్నులు) డిమాండ్ ఉంటుంద న్నారు. 2023లో దేశంలో 747.5 టన్నుల బంగారానికి డిమాండ్ ఏర్పడింది. చరిత్రాత్మకంగా చూస్తే  ప్రపంచంలో తూర్పు మార్కెట్లు (భారత్,చైనాలతో సహా) ధరలు తగ్గినపుడు స్పందిస్తాయని, పశ్చిమ మార్కెట్లు ధరలు పెరిగినపుడు స్పందిస్తా యని డబ్ల్యూజీసీ అధికారి వివరించారు. ఈ దఫా ధర పెరిగిన సమయంలో భారత్, చైనా మార్కెట్లలో డిమాండ్ జోరందుకోవడం మొదటిసారిగా చూస్తున్నామన్నారు. 

ఏప్రిల్‌జూన్‌లో గిరాకీ తగ్గవచ్చు

బంగారం ధరలు  భారీగా పెరగడంతో పాటు ఎన్నికల సీజన్ నడుస్తున్నందున ఈ ఏప్రిల్ త్రైమాసికంలో డిమాండ్ మందగించవచ్చని అంచనా వేస్తున్నామని జైన్ తెలిపారు. తాత్కాలికంగా డిమాండ్ తగ్గినా, పండుగలు, పెండ్లిళ్లు తదితర               సాంస్కృతిక, సీజనల్ అంశాలకు తోడు మెరుగైన రుతుపవనాలతో తదుపరి డిమాండ్ పుంజుకుంటుందన్నారు. డబ్ల్యూజీసీ డాటా ప్రకారం విలువ రీత్యా బంగారం డిమాండ్ ఈ మార్చి త్రైమాసికంలో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రూ.63,090 కోట్ల నుంచి రూ.75,470 కోట్లకు పెరిగింది. ఇందులో జ్యువెల్లరీ డిమాండ్ రూ.45,890 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.52,750 కోట్లకు పెరిగింది. బంగారం పెట్టుబడుల డిమాండ్ 32 శాతం పెరిగి రూ. 17,200 కోట్ల నుంచి రూ.22,720 కోట్లకు చేరింది. 

179 టన్నుల దిగుమతులు

ఈ ఏడాది జనవరి భారత్ బంగారం దిగుమతులు 25 శాతం వృద్ధితో 143.4 టన్నుల (2024 క్యూ1) నుంచి 179.4 టన్నులకు పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఇండియాలో రీసైకిల్ జరిగిన బంగారం 10 శాతం పెరిగి 34.8 టన్నుల నుంచి 38.3 టన్నులకు చేరిందన్నది. 2024 క్యూ1లో బంగారం 10 గ్రాముల త్రైమాసిక సగటు ధర రూ.55,247.20 (దిగుమతి సుంకం, జీఎస్టీ కలపకుండా) కాగా, 2023 క్యూ1లో ఇది రూ.49,943.80 ఉన్నది.

ఆభరణాల వినియోగం 95.5 టన్నులు

‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2024’పై ఒక రిపోర్ట్‌ను డబ్ల్యూజీసీ మంగళవారం విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వివరాల ప్రకారం జ్యువెల్లరీ, పెట్టుబడులతో కలిపి భారత్‌లో మొత్తం బంగారానికి డిమాండ్ ఈ ఏడాది జనవరి మార్చిలో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 126.3 టన్నుల నుంచి 136.6 టన్నులకు చేరింది. ఇందులో ఆభరణాల డిమాండ్ 4 శాతం వృద్ధిచెంది 91.9 టన్నుల నుంచి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల డిమాండ్ (గోల్డ్ బార్స్, కాయిన్స్‌తో సహా) భారీగా 19 శాతం పెరిగి 34.4 టన్నుల నుంచి 41.1 టన్నులకు పెరిగింది. ‘బంగారంతో భారతీ యుల అనుబంధాన్ని ఈ డిమాండ్ పెరుగుదల పునరుద్ఘాటిస్తున్నదని’ డబ్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ వ్యాఖ్యానించారు. ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, బంగారం ఆభరణాల వినియోగం పెరగడానికి భారత్ పటిష్ఠమైన స్థూల ఆర్థిక వాతావరణం మద్దతు ఇచ్చిందని వివరించారు. అయితే మార్చి నెలలో జ్యువెల్లరీ అమ్మకాలు కొంత నెమ్మదించాయని అన్నారు.

19 టన్నులు కొన్న రిజర్వ్‌బ్యాంక్

దేశంలో జ్యువెల్లరీతో పాటు బార్స్, కాయిన్స్, ఈటీఎఫ్‌లు తదితర పెట్టుబడి సాధనాలకూ డిమాండ్ పెరిగిందని జైన్ తెలిపారు. ఇందుకు తోడు రిజర్వ్ బ్యాంక్ కొనుగోళ్లు జరపడం కూడా డిమాండ్ పెరుగుదలకు దారితీసిందన్నారు. 2023 పూర్తి ఏడాదిలో ఆర్బీఐ 16 టన్నుల బంగారం కొన్నదని, ఈ ఏడాది తొలి త్రైమాసికం లోనే 19 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని వెల్లడించారు. పుత్తడి కొనుగోళ్లను కొనసాగిస్తామ న్న సంకేతాలనే ఆర్బీఐ అందిస్తున్నదని చెప్పారు.గోల్డ్ బార్స్, కాయిన్స్ డిమాండ్ 19 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 2 టన్నులకుపైగా పెట్టుబడు లు వచ్చాయన్నారు.