అబ్బో ఇది మామూలు పెండ్లి కాదు!
న్యూఢిల్లీ, జూన్ 29: మనదేశంలో ఇప్పుడంతా అంబానీ ఇంటి పెండ్లి గురించే చర్చ జరుగుతున్నది. ఇలాంటి పెండ్లే ఒకటి చైనాలో ఇటీవల జరిగింది. అబ్బో.. దాని గురించ ఎంత చెప్పినా తక్కువేనని నెట్టింట చర్చ జరుతున్నది. పెండ్లి కోసమే ఓ జంట చైనాకు వచ్చారట. ఐదురోజులపాటు సాగిన ఈ పెండ్లిలో వధూవరులు ఎక్కడికి వెళ్లినా అమెరికా అధ్యక్షుడు వెళ్తే వెంట వచ్చేటంతటి కార్ల కాన్వాయ్.. అది కూడా సాదాసీదా కార్లు కాదండోయ్.. రోల్స్‌రాయిస్, బెంట్లే కార్లు మాత్రమే వాడారు. చైనాలో కొత్తగా పెండ్లి చేసుకొనే జంటకు అందంగా అలంకరించిన ఎరుపురంగు చైనా కుండల్లో డబ్బులు పెట్టి బహుమతిగా ఇవ్వటం ఆనవాయితీ.. కానీ, ఈ పెండ్లిలో అది రివర్స్ అయ్యింది. అతిథులకు ఖరీదైన విందుతోపాటు ఎరుపురంగు ఎన్వలప్‌లలో 8 వేల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.66000 పెట్టి.. పెండ్లికి వచ్చిన అతిథులందరికీ బహుమతులుగా ఇచ్చారట. ఓ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ పెండ్లి విశేషాలు సోషల్‌మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మరింది.






