ఢిల్లీ ప్రజల అష్టకష్టాలు
6కు పెరిగిన మృతుల సంఖ్య
భారీ వరదలకు కారణాలెన్నో..
న్యూఢిలీ,్ల జూన్ 29: దేశరాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షం వల్ల ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. వరదల వల్ల చనిపోయిన మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇక వరదల వల్ల కరెంటు కోతలు, నీటి కష్టాలు అధికం అయ్యాయి. మునుపెన్నడూ చూడని విధంగా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం మాత్రమే కాకుండా ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ మొదలైన ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి.
వరదలకు కారణాలు అనేకం..
ఊహించకుండా వచ్చిన భారీ వరద వల్ల లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. 1901వ సంవత్సరం తర్వాత ఇంత భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వల్ల ఈ పరిస్థితి సంభవించిందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తేందుకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసైనా అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు పూనుకుంటుందో చూడాలి
గోడ కూలి చిన్నారుల దుర్మరణం
భారీ వర్షాలకు గోడ కూలి గ్రేటర్ నోయిడాలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మొత్తం ఆరుగురు చిన్నారులు ఈ ఘటనలో గాయపడగా.. ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన సూరజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోద్నా గ్రామంలో చోటు చేసుకుంది.






