బాబోయ్.. ఎంత పొడుగు జుట్టో
- రేణు జట్టు పొడవు ౮అడుగుల ౧౦ అంగుళాలు
- గిన్నిస్ బుక్ రికార్డ్సులో ఆమె పేరు నమోదు
డెహ్రాడూన్, ఆగస్టు ౮: ప్రపంచంలోనే అత్యంత పొడవైన శిరోజాలున్న మహిళగా ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధరియాల్ అరుదైన గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఈమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. రేణు జుట్టు పొడవు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 అడుగుల 10 అంగుళాలు. గతంలో ఈ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన దిన అలియా నాసిరోవా పేరిట ఉండేది. ఆమె జుట్టు పొడవు ఏడు అడుగులకు పైగానే. రేణు ఆ రికార్డును ఛేదించారు.
ఆమె 2015 నుంచి జుట్టు పెంచడం ప్రారంభించారు. 9 ఏళ్ల నుంచి ఆమె ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించుకోలేదు. భారతీయ సంస్కృతి, మహిళా సంప్రదాయాల్లో పొడవైన జుట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, అందుకే తాను జుట్టు కత్తిరించకుండా ఉంటున్నానని రేణు స్పష్టం చేశారు. అయితే.. అదేం.. సులభమైన పని కాదని, జుట్టు సంరక్షణ కోసం రోజుకు గంటలు గంటల సమయం వెచ్చించాల్సి వస్తున్నదని తెలిపారు. జుట్టు సంరక్షణ కోసం తాను రసాయన ఉత్పత్తుల జోలికి వెళ్లనని తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫేమస్. ఆమె చానెల్‌కు వేలాది మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వారితో ఆమె జుట్టు సంరక్షణ చిట్కాలను పంచుకుంటున్నారు.






