5 May, 2026 | 3:34 AM

వర్తమానంలో ‘నువ్వే ఒక సమూహం’

18-08-2025 12:36 AM

డా.ఇసరం శ్రీనివాస్ : 96527 23900

డా.మహమ్మద్ హసేన

కవులు సాధారణంగా తమ చుట్టూ జరుగుతున్న సామాజిక రాజకీయ అంశాలకు ప్రభావితమవుతాడు. వాటినే తమ కవితా వస్తువులుగా ఎంచుకుని కవిత్వం రాస్తుంటారు. అలా రాసే వారిలో తిరిగి తమకు తోచిందల్లా రాసేవా రు ఒక సమూహం. సమాజానికి అవసరమయ్యేవి మాత్రమే రాసేవారు మరొక సమూహం. నేటి ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కవులు ప్రతి అంశాన్ని కవిత్వీకరించి, పుస్తకాలుగా ముద్రింది, వాటికి పాఠకాదరణ పొందటం కష్టతరమైన విషయం.

అయితే, వర్తమాన సమాజానికి అవసరమయ్యే వస్తు వ్యక్తీకరణ ఏ ప్రక్రియలో ఉన్న అది సాహితీరంగంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యమే కవి డాక్టర్ మహమ్మద్ హసే న రాసిన ‘నువ్వే ఒక సమూహం’ అనే కవితా సం పుటి. పుస్తకంలో కవి ప్రజా చైతన్య కవిత్వం, సం ఘటనాత్మక కవిత్వం, స్వీయానుభవ కవిత్వం అని మూడు ప్రధానవర్గాలైన కవితలు కనిపిస్తా యి.

సంఘజీవియైన మనిషి లక్ష్యసాధనలో పరాజయం పాలైనప్పుడుగాని, భవబంధాలు విచ్చి న్నమైనప్పుడు గానీ, ఒంటరితనం అప్రయత్నంగానే అపరిచిత వ్యక్తి వలె పలకరిస్తుంది. అది కొం తకాలం సమస్యల చిక్కుల్లోంచి బయటపడటానికి, మనసు విహాంగ వీక్షణంగా సేద తీరటానికి ఒక ఔషధంగా పనికొచ్చినా, కాలం గడుస్తున్నా కొద్ది అది మందులేని విషంగా మారుతుంది.

అది మనిషిని నిరాశ నిస్పృహలతో పూర్తిగా అచేతనంలోకి తీసుకెళ్తుంది. దీని నుంచి బయటపడి ఒక్కో అడుగు ముందుకు వేస్తే, ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారతారనేది ‘నువ్వే ఒక సమూహం’ అనే పుస్తక సారాంశం. ఈ పుస్తకం నేటి సామాజిక పరిస్థితులకు ప్రతీకగా నిలుస్తుంది.

‘ఒంటరితనం నీకొక్కడికే అనుకుంటున్నావేమో

నది పుట్టుక కూడా ఒంటరిగానే మొదలైతుంది

నువ్వొంటరివని ఎవరన్నారిప్పుడు

ఒక్కసారి నీ అంతః సముద్రంలోకి

నీకై నీవు పారిచూడు 

అంతుచిక్కని సమూహాలెన్నో

నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాయి” 

అంటారు కవి ఈ కవితలో. విశ్వంలోని భూమిని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే చిన్నచిన్న ఇసుక రేణువులు, మట్టి ముద్దలు ముద్దలుగా  కలిసి ఒక సువిశాలమైన భూమిలా అవతరించడం మనం గమనించవచ్చు. అలాగే ఒక్కొక్క చుక్క కలిసి మహాసముద్రాలు వెలిసినట్లు నీవు వేసే ఒక్క అడుగు నీవు చేసే ఒక్క ప్రయత్నం  నీకే తెలియని, నీలో దాగి ఉన్న నవ్వు ఒక సమూహ శక్తితో సమానం అని,  నీ అంతః సముద్రంలోకి పారి చూసి అద్భుతాలు సృష్టిస్తే నీ ఆజ్ఞ కోసం అనేక సమూహాలు ఎదురుచూస్తాయని, కాబట్టి మనిషి ఎప్పుడు ఒంటరి కాదని అనేక రకాల శక్తి సమూహాలు అతనిలో దాగి ఉంటాయని కవి అంటారు.

“ కాలం కలిసి రావట్లేదని నిరాశపడకు కార్యం 

మంచిదైతే కాలం కూడా సహకరిస్తుంది” 

అంటాడు కవి ‘ఆశ’ అనే కవితలో. మానవుడు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోనవకూడదని, తాను చేయాల్సిన పని చేయకుండా.. అవి వేకపు సమాధానాలు వెతుక్కోవద్దని సూచిస్తారు. ఇందులో మంచి కార్యము అంటే కష్టపడే తత్వం అని ఇక్కడ  అర్థం. మరో కవితలో “శిశిరం పోతే నే వసంతం వికసిస్తుంది అహాన్ని వీడితేనే ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది’ అని వ్యక్తి ఆహాన్ని శిశిర రుతువుతో సాదృశ్యం చేసి నేనే గొప్ప అనే అహంకారాన్ని విడనాడితేనే సంపూర్ణ మానవ త్వం వరిస్తుందంటారు.

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదడులకు కదలిక’ అన్న ప్రజాకవి కాళోజీ కవితార్థం వచ్చే విధంగా, అక్షరం చిన్నదైనా ఆయు ధమై పోరాడుతుంది అంటాడు మరో కవితలో కవి. ఇది అక్షర సత్యం నేడు ఎంతో మంది మహనీయులు మన కళ్ల ముందు లేకున్నా వారు పదిలపరిచిన అక్షరమే ఒక ఆయుధమై సామాన్య ప్రజలతో పోరాటం చేయిస్తుంది.

భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం,  ఏకత్వంలో భిన్నత్వాన్ని “లౌకికతత్వం” అనే కవితలో కవి వర్ణిస్తారు. సప్తవర్ణాలు కలిసి ఇంద్రధనస్సుకు రూపం ఇచ్చినట్టు  ఖురాన్, బైబిల్, గీతాసారం ఒక్కటిగా కలిసి భారతావనికి బహు ఘనకీర్తి తెచ్చింది అంటారు.

“వాళ్లేమో రామరాజ్యం అంటారు

వీళ్లేమో ఇస్లామిక్ రాజ్యం అంటారు

అవి రెండు జరగాలంటే ఎన్ని తలలు తెగాలి

మత యుద్ధాలు, మత ఘర్షణలతో     

సాధించేది ఏమిటి?’ అంటూ “నువ్వు నేను బా యిబాయి’ అనే కవితలో వాపోతారు. ‘మతం’ అనేది మానిషి మంచి జీవన విధానానికి కాకుం డా, ఎవరైతే మతం మత్తులో మునిగి తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా మారి మతపరమైన యుద్ధాలకు కారణమవుతారో వారు సాధించేది ఏమీ లేదని, మతం కంటే మానవత్వమే గొప్పద ని ఈ కవిత ద్వారా కవిచాటి చెప్తారు. స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా గౌరవాభిమానాలు పొందాలని స్త్రీవాద దృక్పథంతో “వివక్ష ఎందుకు” అనే కవిత రాశారు. 

“జన్మజన్మల వాగ్దానాలు కాదు

ఈ జన్మలోనే ఆనందాల్ని అందించు

నీతో సమానమే అయినప్పుడు నన్ను     

కూడాగౌరవించు” అంటూ స్త్రీలపై వివక్ష తగదని హితవు చెప్తారు కవి. మరో కవితలో ‘చేతిలో గీతల్ని పదే పదే చూసుకొని మురిసిపోకు అవి నీ జాతకాన్ని మార్చే అదృష్ట రేఖలు కావు” అని సమాజంలోని మూఢ అంధకారాన్ని విడనాడి వాస్తవికత వైపు పయనించాలి’ అని చెప్తారు. ‘తర్కం’ కవితలో ‘గుడికెళ్తే దేవుడు కరుణిస్తాడని నమ్ముతాం.. బడికి వెళ్తే భవిష్యత్తు మారుతుందని నమ్మం’ అని చెప్పడం నవ సమాజ నిర్మాణం పట్ల కవికి ఉన్న సంఘర్షణ కనిపిస్తుంది.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’కి హృదయ సమానమైన మంచి కవిత్వ శిల్ప నిర్మాణంతో ఆర్ట్స్ కాలేజ్ ‘రూమ్ నెంబర్ 57’ అనే కవిత ఉం టుంది. ఇది ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఖ్యాతిని మదినిండా నెమరేస్తుంది. 

ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌసెస్

వెల: రూ.150