calender_icon.png 18 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితాశేఖరుడు

18-08-2025 12:31:48 AM

మల్యాల దేవీప్రసాద్

తెలుగు పరిశోధక కవితాశేఖరుడు మల్యాల దేవీప్రసాద్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మెదక్ మండల సాహిత్యాన్ని కోటగా పేర్చిన సాహితీవేత్త. దేవీప్రసాద్ 1901లో పాలమూరు జిల్లాలోని శ్రీరంగాపురంలో హనుమాంబ, కృష్ణయ్య దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో దేవీప్రసాద్ మేనమామ స్వగ్రామమైన గుమ్మడంలో పెరిగారు. అనుముల సుబ్రహ్మణ్యం వద్ద సంస్కృతాంధ్రం చదువుకున్నారు.

దేవీప్రసాద్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, గ్రంథాలయ ఉద్యమకారుడిగా అనే ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించారు. హిందీ భాషా కోవిదు డిగాను ప్రసిద్ధిగాంచారు. దేవీప్రసాద్ బహు గ్రంథకర్త. 1969లో ఆయన మెదక్ మండల సాహిత్య చరిత్ర రాశారు. ఇదే సంవత్సరం తెలంగాణ విస్మృ త కవుల సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు.

‘నారద గర్వభంగం, శివహరి శతకము, విశ్వరూపానంద శతకము, రంగ శతకము, కృష్ణార్జునోపదేశం, సనాతన ధర్మంలోని శుద్ధి, భారతోదయం, యాదవ చంద్రిక, మెదక్ మండ ల నగరములు, అభినవ బేబి వైద్యం, ఖండ కావ్యములు చాటువులు’ మొదలైన పుస్తకాలు రచించి వెలువరించారు. దేవీప్రసాద్ రచనలు ‘గోలకొండ’, ‘పల్లెటూరు’ పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమయ్యాయి. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి నడిపిన గోల్కొండ పత్రికలో దేవీప్రసాద్ సబ్ ఎడిటర్‌గా, ప్రచారకుడిగా సేవలందించారు.

ఆ అనుభవంతోనే ఆయన 1951లో ‘పల్లెటూరు’ అనే పత్రిక నడిపారు. నాటి జీవనస్థితి గతులను, వారి హక్కుల గురించి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. డాక్టర్ సీ నారాయణరెడ్డి తొలి కవితలు పత్రికలో విరివిగా అచ్చయ్యేవి. తెలంగాణ రచయితల సంఘం సభ్యులు కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, సీ నారాయణరెడ్డి నేతృత్వంలో దేవీప్రసాద్ తెలంగాణ సభలు సమావేశాలు నిర్వహించేవారు.

అనేక మంది సాహితీవేత్తల పుస్తకాలు ముద్రించారు. దేవీప్రసాద్ ఆ రోజుల్లోనే వర్ణాంతర వివాహం చేసుకున్నారు. దంపతులు నాడు ఊరు విడిచి కొన్ని రోజులు సురవరం ప్రతాపరెడ్డి స్వగ్రామమైన ఇటిక్యాలపాడులో గడిపారు. ఆ తర్వాత వారు సంగారెడ్డిలో స్థిరప డ్డారు. దేవీప్రసాద్ సుమారు నాలుగు దశాబ్దాలు అక్కడి ప్రజల తలలో నాలుకగా మెలిగారు. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తగానూ పనిచేశారు.చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా, ఉద్రమకా రుడిగా, కార్పొరేటర్‌గా, సాహితీసంస్థల నిర్వాహకుడిగా బహుముఖ సేవలందించారు.

దేవీప్రసాద్ మాండలిక పదాలపై 15 ఆగస్టు 1951 ఒక పత్రికకు రాసిన వ్యాసం చదివితే ఆయనంతో ప్రతిభావంతుడో అర్థమవుతుంది. “తెలంగాణా యందలి వేరువేరు మండలములందు వేరు వేరు వేరు విధములుగా యచ్చట నివసించు జనులు ఉచ్ఛారణలోను స్వరములోను హ్రస్వ దీర్ఘయుతం వర్ణభేదము గలిగించుకొని మాటలాడుచుందురు, కర్ణాటక ప్రాంతమున కంటియుండు తెల్గు మండలములో ధనికునికి ధణి యని నన్నకు నణ్ణ యని నకారమునకు ణకారము వాడుతుందురు.

పదోచ్ఛారణ దీర్గాంతము గలిగియుండును. వేగమునకు జిగ్గెయని వాడుచుందురు. పెద్దవారలను ఆప్సయనియు, చిన్న వారిని పిల్ల పిల్లోడు అనియు పిలుచుచుం దురు. గ్రామాధికారిని గౌడ్ అందురు, మహబూబ్‌నగరము జిల్లాలో ఈ గౌడ్ శబ్దము ఈడిగవారికి వర్తించును. మెదక్ జిల్లాలో గొల్లవారిని గోడని యందురు. కర్ణాటక ప్రాంతమునకు కొంతదూరముగానుండు గద్వాల మండలములో కోమటిని కామటియని మోటను మాటయని సామాన్య జనులలో వాడుచుందురు. అలంపురము మండలమున ఆడబిడ్డను పాపయని యందురు.

ఈ పాప శబ్దమును పాలమూరు మండలముల లోయసహ్యమైదిగా తలంతురు” అంటూ అచ్చతమైన తెలంగాణ మాండలికం లో సాగుతుందీ వ్యాసం. దేవీప్రసాద్ సాహిత్యాన్ని ముద్రించేందుకు కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం వారు మెదక్ జిల్లా సాహిత్యాన్ని రెండో ముద్రణగా ప్రచురిస్తున్నారు. 1984లో మెదక్ మండల సాహిత్య పరిషత్ రంగారెడ్డి ముద్రించిన సంగమేశ్వర శతకాన్ని తిరిగి యథావిధిగా ఈ పుస్తకం లో అనుబంధంగా చేర్చడం ముదావా హం.

దేవీప్రసాద్ కుమార్తె మల్యాల పుష్పలత ఆంధ్రోపన్యాసకురాలు. ఆమె తెలుగు అకాడమీలో పనిచేశారు. 81 ఏళ్ల వయసులో ఇటీవల వృద్ధాప్య సమస్యలతో ఆమె పరమపదించారు. ఆమె జీవించి ఉండగానే తన తండ్రి మల్యాల దేవీప్రసాద్ సాహిత్య చరిత్ర పునర్ముద్రణను చూడాలనుకున్నారు. కానీ, ఆమె కోరిక నెరవేరలేదు. ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నెల 17న (ఆదివారం) హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో దేవీప్రసాద్ రచన ‘మెదక్ మండల సాహిత్య చరిత్ర’ పుస్తకావిష్కరణ వేడుక జరిగింది.

 వనపట్ల సుబ్బయ్య