18-08-2025 12:41:17 AM
రతన్ రుద్ర : 7842195755
రాజా హైదరాబాదీ (ఆశారాజు)
“నా అరచేతులను చూడండి
హైదరాబాద్ కనిపిస్తుంది !
నేను నిలుచుంటే నిలువెత్తు
చార్మినార్ దర్శనమిస్తుంది!’ అనే పద్యం తో రాజా హైదరాబాదీ (ఆశారాజు) ‘ఏక్ షామ్ చార్మినార్‌కే నామ్’ అనే సంకలనం కవితా ప్రవాహం ప్రారంభమై ‘అరవై తొమ్మిది తెలంగాణా ఉద్యమంలో /‘ధర్మకాంటా’ సాయంత్రం/జై తెలంగాణ నినా దమై నిలిచిపోయింది..’ అన్న పంక్తులతో ముగుస్తుంది. హైదరాబాద్ నగర చారిత్రక వైభవం, సంస్కృతీ సంప్రదాయాలపై ఎంతో మంది రచయితలు ఎన్నో పుస్తకాలు రాశారు.
ఎంతో మంది కవులు నగరంపై ఉన్న ప్రేమను కవీత్వకరించారు. కానీ, ఆశారాజు కలం నుంచి జాలువారిన ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ కవితల సంకలనం వాటన్నింటి కన్నా భిన్నమైనది. పుస్తకం భాగ్యనగరం ఆత్మను స్పృశించేలా ఉంది. పుట్టి పెరిగిన వాతావరణం, చదువుకున్న బడులు, నడిచిన రోడ్లు, స్నేహితులతో కబుర్లాడిన జ్ఞాపకాలు, సఖులతో ఊసులాడిన అనుభూతులు.. ఇలా ఒక్కటి కాదు జీవితంలోని మలుపులు, మేలుకొలుపులన్నింటినీ నగరంతో ముడిపెట్టి అక్షరబద్ధం చేశాడు. నగరంతో పెనవేసుకున్న జీవితాలను కళ్లకు కట్టారు. కవితల్లో పలవరించాడు.
‘సుల్తాన్‌బజార్‌లో నడుస్తుంటే/ఎక్కడి నుంచో ఎవరో/కాకర పువ్వొత్తి కాల్చి/ మీద విసిరింది..మెరిసింది’ అంటాడు కవి. ‘బషీర్‌బాగ్ మంగత్‌రాజ్/ముత్యాల పేర్ల సొగసు ల దాకా/దీపాల కళ్లలో చిలిపి నవ్వు వినిపించింది’ అంటూ ఉప్పొంగిపోతాడు. ‘బంతి పూల దండల మీది వెలుగులా/ హైదరాబాద్ గారాబంగా మురిసిపోయింది/ నా భుజం మీద తల ఆనించి/ ట్యాంకు బండ్ అలల్లాగా పరవశించింది’ అంటూ అనుభూతులు పంచుతాడు. ఇలా నగరంలో ఒక్కో వీధి, ఒక్కో బజార్, ఒక్కో ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలను అలవోకగా, ప్రేమగా, ఒద్దికగా కవితల్లో అద్దాడు. ప్రతీ కవితతో కవి మనల్ని హైదరాబాద్ వీధుల్లో తిప్పి, దాని పరిమళాన్ని ఆస్వాదింపజేస్తా రు. లాడ్ బజార్ రంగులు, అత్తర్ దుకాణా ల సువాసనలు, గోల్కొండ కోటలో ప్రతిధ్వనులను కవి మళ్లీ మనకు వినిపిస్తాడు. ‘హైదరాబాద్ ఆ పేరు వినగానే రెండు మా మూలుగా గుర్తుకొస్తాయి. ఒకటి చాయ్! మరొకటి ప్రేమ!’ అని ఓ కవితలో ఎలుగెత్తి చాటాడు కవి. ఈ పంక్తుల్లో హైదరాబాద్ నగర ప్రజలు చాయ్‌తో పెనవేసుకున్న బంధం లోతేంటో తెలియజేస్తాడు కవి. ‘నగర పౌరులకు ‘చాయ్’ అంటే కేవలం ఒక పానీయం కాదు. అది సంస్కృతిలో భాగం. ఉద్వేగం. ఈ నగరంలో ప్రతి కథ చాయ్ కప్పుతోనే మొదలవుతుంద’ంటాడు కవి.
నాకు హైదరాబాద్‌లో,
జోరుగా వర్షం కురిసినప్పుడల్లా
పత్తర్‌గట్టీలో
ఆమె గులాబీ చెప్పులు కొట్టుకపోయి,
మదీనా బిల్డింగ్ దగ్గర..
వికసించినట్టు, తేలిందే జ్ఞాపకానికొస్తుం ది..’ అంటూ కవి తన యౌవనపు తలపుల ను కవితా మాలికలుగా కుమ్మరిస్తాడు. ‘రాత్రి, కురిసే ఇంధ్రధనస్సు వన్నెల్లో/ ఆరిపోని, తరతరాల, వెన్నెల తడిలో/విడిపోనిచ వెచ్చని కరచాలనంలా/ఈసారి కూడా ‘రంజాన్’ జరుపుకొందామా’ అంటూ ప్రేయసి ని మనసారా రంజాన్‌కు ఆహ్వానిస్తాడు. ‘మతం లేదు మరకలేదు/ స్నేహానికి ముసు గు లేదు/ ఏ ఇద్దరి మధ్య కూడా/ ఇక్కడ విడగొట్టే గోడలేదు..’ అంటూ హైదరాబాద్‌లోని మతసామరస్యాన్ని చెప్తాడు.
సంక్రాం తి సీజన్‌లో నగరంలో ఎటు చూసినా రం గు రంగుల పతంగులు గగన వీధిలో కనిపిస్తాయి. పిల్లలు ఎగురవేసే పతంగులను యాద్ జేస్తాడు, కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఒకప్పుడు పాత బస్తీ యువకులు బస్కీలు తీసేవారు. మూసీ నది వరదలు, పాత బస్తీ గల్లీలు, అత్తరు సువాసనలు, రిక్షావాలాలు ఇలా ఎన్నెన్నో సంగతులను నేటి తరానికి కొత్తగా పరిచయం చేశాడు కవి. మొత్తంగా కవికి చార్మినార్ అంటే ఎనలేని ప్రేమ అని పదే పదే అనిపిస్తుంది.
ఎక్కువ కవితల్లో చార్మినార్‌ను ఉపమానంగా తీసుకోవడం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ‘మాదాపూర్ కాదు/ మణికొండా కాదు/ మదీనా బిల్డింగ్ దగ్గరే/ విడిపోయిన దోస్తులను/ మళ్లీ కలుసుకుని/ కౌగిలించుకుం దామా!/ అమెరికా నకళ్లు‘మాల్స్’లో కాదు/ ఆత్మలేని మోడరన్ గుంపుల్లో కాదు/పులరాశుల్లాంటి/పత్తర్‌గట్టీ బజారుకెళ్లి ప్రేమలు పంచుకునే పసిపిల్లల్లా తిరిగిన/ మర చిపోలేని/ ఊదు పొగల రాత్రులను మళ్లీ రంగులమ యం చేద్దామా!’ అంటూ కవి నగరంపై గ్లోబలైజేషన్ ప్రభావాలను చెప్తూనే, ‘మళ్లీ పాత రోజులు వస్తే బాగుండు’ అన్న ఆకాంక్షను మనలో రగిలిస్తాడు.
‘నా వెనుక చార్మినార్ అందముంది
మిత్రులు కలిసేచోట,
ఇరానీ చాయ్ పొగల పరిమళముంది
లీలగా, గొప్ప కవి మఖ్దూమ్ రాసిన
తడి తడి పాట ‘ఏక్ చమేలీ కే మండ్
వే తలే’ వినిపిస్తుంది..’
‘జైలు గోడల మీద, చెరిగిపోని
చరిత్ర సంతకం,
‘నా తెలంగాణా కోటి రతనాల వీణ’ కనిపిస్తుంది
మహాకవి దాశరథి చెదిరిపోని స్వప్నం’ అంటూ.. అంటూ తెలంగాణ ప్రఖ్యాత తెలు గు, కవి దాశరథి కృష్ణమాచార్యులు, ఉర్దూ కవి మఖ్దూమ్ మోహియుద్దీన్‌పై తనకున్న ప్రేమను చాటుకుంటాడు కవి ఆశారాజు. మధ్య మధ్యలో ఉర్దూ గజళ్ల సవ్వళ్లు, షాయరీలకు ప్రేక్షకులిచ్చిన కరతాళ ధ్వనులను లీల మాత్రంగా మనకు వినిపిస్తాడు కవి. నగరంలో రిక్షాలో తిరగడం రొమాంటిగ్ ఉండే ది, ఇరానీ హోటల్‌లో స్నేహితుడి కోసం ఎదురుచూడటం థ్రిల్లింగ్‌గా అనిపించేది.. అన్న కవి ప్రతీకలు పాఠకులకు నాస్టాల్జిక్‌గా అనిపిస్తాయి. ఈ కవితల సంకలనం ఒక కాలయంత్రంలా మారి, మనల్ని శతాబ్దాల ముందుకు తీసుకెళ్తుంది. నాటి హైదరాబాద్‌ను మన కళ్ల ముందుకు తీసుకొస్తుంది. ఈ కవిత్వం కేవలం హైదరాబాద్‌లో నివసించే వారినే కాదు, కొత్తగా ఎవరు ఈ కవితలను చదవినా హైదరాబాద్‌తో ప్రేమలో పడిపోతారు. నగరంలో కొద్దికాలం జీవించిన ఎవరికైనా నగరంతో కమ్మని జ్ఞాపకాలు ఉండి తీరతాయి.. అలాంటి వాళ్లంతా ఒక్కసారి పుస్తకాన్ని చదవాలి.. అప్పుడు వారి ముందు మనోహరమైన ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. వారికి అద్భుతమైన పఠనానుభవాన్ని అందిస్తుంది. ఆశారాజు కలం నుంచి జాలువారిన ఈ కవితలు నిజంగా పాఠకులకు ఒక గొప్ప కానుక. ఇది కేవలం చరిత్రకు సంబంధించిన పుస్తకం కాదు. నగరంతో ప్రేమలో పడిన ఒక కవి హృదయం నుంచి బయటకు వచ్చిన అందమైన ప్రేమలేఖ.
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌసెస్,
‘అనేక’ పుస్తక విక్రయ కేంద్రం