6 August, 2026 | 1:25 AM

సైబర్ వారియర్‌గా మారాలి...

06-08-2026 12:10 AM
  1. యువతకు సీపీ రష్మీ పిలుపు
  2. ఉత్సాహభరితంగా సైబర్ జాగృక్త దివస్’

సిద్దిపేట క్రైం, ఆగస్టు 5  (విజయక్రాంతి) : సమాజంలో ప్రతిఒక్కరూ ’సైబర్ వారియర్’ గా మారి తమ చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పించాలని సీపీ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. ఆన్లైన్ జూదం, మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ’సైబర్ జాగృక్త దివస్’ పురస్కరించుకుని ’సురక్ష కా తిరంగా’ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

మొదట విద్యార్థు లతో డిగ్రీ కళాశాల నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముస్తాబాద్ చౌరస్తా వద్ద విద్యార్థులందరితో కలిసి ’సైబర్ వారియర్ ప్రతిజ్ఞ చేయించి భారీ మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేసే విధానాన్ని సైబర్ క్రైమ్ ఏసీపీరాజు వివరించారు. ఓటీపీఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ వంటి వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థు లకు సైబర్ క్రైమ్స్ అవగాహనపై ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. సరైన అవగాహన లేక గ్రామీణరైతులు సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని అడిషనల్ డీసీపీ కుశాల్కర్ చెప్పారు.

ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ, ఓటీపీ, సీవీవీ , బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదని సూచించారు. అంతకుముందు సీపీ రష్మీసురక్ష కా తిరంగా పోస్టర్ను ఆవిష్కరించారు. సైబర్ ఆన్లైన్ క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.