15-11-2025 12:03:52 AM
-కిశోర బాలికలకు స్నేహ సంఘాల ఏర్పాటు
-ఎస్‌హెచ్‌జీ మాదిరిగానే స్నేహ సంఘాల పనితీరు
-మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : ప్రతి యువతి సురక్షితంగా, ఆరోగ్య వంతంగా, ఆత్మవిశ్వాసంతో సమాజ ప్రగతికి నాయకురాలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కిశోర బాలికలకు స్నేహ సంఘాల ను శుక్రవారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు పనిచేయనున్నాయని తెలిపా రు.
రాష్ర్టవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు గల కిశోర బాలికలు 19.13 లక్షల మం ది ఉన్నారని, వారి కోసమే ఈ స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కిశోర బాలికల్లో ఆరోగ్య అవగా హన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణలు, అనిమియా తగ్గింపు, సరైన పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్ భద్రత, ఆన్‌లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై స్నేహ సంఘాలు అవగాహన కల్పిస్తాయని వెల్లడించారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65,615 మందితో 6,138 స్నేహ సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మం త్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, టీజీ ఫుడ్స్ చైర్ పర్సన్ ఫహీం పాల్గొన్నారు.