11 April, 2026 | 3:09 PM

మీ ఓటు మాకే!

13-05-2024 01:39 AM

మండు వేసవి.. మాడు పగిలిపోయే వేడి.. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కానీ, ఈ వేసవిలో అంతకంటే వేడి పుట్టించిన అంశం మరొకటి ఉన్నది. అవే సార్వత్రిక ఎన్నికలు. గతంలో ఎన్నడూ కనిపించనంత వాడి వేడి ఈసారి ఎన్నికల్లో కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ 

నువ్వా నేనా అన్నంతగా ప్రచార పోరాటం చేశాయి. ఒక పార్టీ తాము పేదలపక్షమని, వారి అభివృద్ధికి ‘గ్యారెంటీ’ ఇస్తే.. మరో పార్టీ తమకు ‘దేశ’మే ముఖ్యమని ప్రకటించింది. ఇంకో పార్టీ తమది ‘ప్రశ్నించే’ గొంతుక అని ప్రకటించుకొన్నది. రెండు నెలలపాటు మండే ఎండలో సైతం ఈ పార్టీల ప్రధాన నేతలు కాళ్లకు 

బలపాలు కట్టుకొని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రచారం ముగిసింది. నేడు రాష్ట్రంలోని ౧౭ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఒక అసెంబ్లీ 

ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ మూడు పార్టీలు ప్రజలకు తమ మ్యానిఫెస్టోల్లో అనేక హామీలిచ్చాయి. అయితే, నేతల సంచలన ప్రకటనలు, తిట్ల పురాణాల మధ్యలో ఈ హామీలను ప్రజలు కొంచం మర్చిపోయి ఉండవచ్చు. అందుకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలు మరోసారి..

దేశమే ఎజెండా

1. పౌరసత్వ సవరణ చట్టాన్ని  అమలు చేసి తీరుతాం. దీనిని ఎవరూ ఆపలేరు. 

2. దేశవ్యాప్తంగా కామన్ సివిల్‌కోడ్‌ను అమల్లోకి తెస్తాం. 

3. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి ఆ కోటాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తాం. 

4. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రతి ఇంచు భారత్‌లో భాగమే. మేం మూడోసారి అధికారంలోకి వస్తే ఆ ప్రాంతాన్ని భారత్‌లో కలిపేస్తాం. 

5. వచ్చే ఏదేండ్లలో భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతాం. 

6. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించింది. చట్టవ్యతిరేకంగా రాజ్యాంగంలోని పీఠికలో లౌకిక అనే పదాన్ని చేర్చింది. మేం మూడోసారి అధికారంలోకి వస్తే పీఠికలోని లౌకిక పదాన్ని తీసేస్తాం. 

7. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారినందరినీ తరిమేస్తాం.

8. భారత్‌లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు ఏ దేశంలో వారి ఇండ్లలోకి వెళ్లి చంపేశాం. ఇకపై కూడా ఉగ్రవాదులను వేటాడుతాం. 

ప్రజలకు గ్యారెంటీ

1. సమన్యాయం

జనగణనతోపాటు సామాజిక, ఆర్థిక అంశాలతో కూడిన కులగణన 

రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగింపు. 

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ 

పోడు భూములపై ఆదివాసీలకు ఏడాదిలో హక్కులు 

ఆదివాసీ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించటం. 

2) రైతు న్యాయం..

స్వామినాథన్ సిఫారసులను అనుసరించి ఎంఎస్పీకి చట్టబద్ధత 

రైతు రుణాల మాఫీ కోసం రైతు కమిషన్ 

పంట నష్టం జరిగిన రైతులకు 30 రోజుల్లో పంటల బీమా పథకం కింద పరిహారం చెల్లింపు 

రైతులకు లాభసాటిగా స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతి విధానం 

వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు 

3) కార్మిక న్యాయం 

ప్రతి కార్మికుడికి ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు, ఆపరేషన్లతో కూడిన ఆరోగ్య రక్ష 

ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ కూలీ రూ.400కు పెంపు 

పట్టణ ప్రాంత కార్మికుకలకు ఉపాధి హామీ చట్టం అమలు 

అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు 

ప్రభుత్వ విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ రద్దు 

4) యువ న్యాయం

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ 

యువతకు నెలకు రూ.8,500 ఉపకార వేతనంతో ఒక ఏడాది అప్రెటిస్‌షిప్ శిక్షణ 

అన్ని రకాల పరీక్షపత్రాల లీకేజీని అరికట్టడానికి ప్రత్యేక చట్టం 

గిగ్ కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన అనువైన వాతావరణ కల్పన 

రూ.5వేల కోట్ల నిధితో స్టార్టప్ స్థాపించే యువతకు ప్రోత్సాహకాలు 

5) మహిళా న్యాయం

ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.1 లక్ష సాయం 

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు 

అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల్లో కేంద్రం వాటా రెట్టింపు 

ప్రతి గ్రామంలో మహిళల హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకురాలు నియామకం 

ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాల సంఖ్య రెట్టింపు 

ప్రశ్నిస్తాం, నిలదీస్తాం

౧. విద్యుత్తు 24 గంటలపాటు సరఫరా చేసేలా రేవంత్ సర్కార్‌ను నిలదీస్తాం.

౨. మైనార్టీల రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేయకుండా అడ్డుకుంటాం.

౩. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడుతాం.

౪. రైతుబంధు రూ.15 వేలు అమలు చేయడంతోపాటు రైతులందరికీ వచ్చేలా 

 ఉద్యమిస్తాం.

౫. చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ కాంట్రాక్టు ఇచ్చేలా కృషి చేస్తాం.

౬. హైదరాబాద్ నగరం కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కేంద్రం కుట్రలు తిప్పికొడుతాం.

౭. పింఛన్లు రూ.4 వేలకు పెంచేవరకు అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తాం. 

౮. 33 జిల్లాలను రద్దు చేయకుండా వాటి అస్థిత్వం కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తాం.