11 April, 2026 | 4:47 PM

వసతులు అరకొర.. ప్రయాణికుల మొర

13-05-2024 01:39 AM

అధ్వానంగా కామారెడ్డి బస్టాండ్

గుంతలమయంగా ప్రాంగణం

చినుకు రాలితే చిత్తడిమయం

వేసవిలో తాగునీటి సౌకర్యమూ లేదు..

ప్రయాణికుల రద్దీకి తగినన్ని బస్సుల్లేవు

కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కొత్తబస్టాండ్ సమస్యల నిలయం మారింది. కామారెడ్డి జిల్లాకేంద్రంగా మారినా కానీ బస్టాండ్ రూపురేఖలు మాత్రం మారడం లేదు. ఇక్కడి నుంచి నిత్యం హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అరకొర వసతులతో నిత్యం ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మూడు జిల్లాల కూడలిగా ఉన్న బస్టాండ్ చినుకు పడితే చిత్తడిగా మారుతున్నది. చిన్న వర్షం పడితే చాలు బస్టాండ్ బురదమయంగా మారుతున్నది. గుంతల్లో వర్షపు నీరు చేరుతున్నది. దాహం తీర్చుకునేందుకు కనీసం ప్రయాణికులకు మంచినీటి సౌకర్యమైనా లేదు. ఎండలు మండుతున్నా ఆర్టీసీ అధికారులకు పట్టింపు లేదు. మూత్రశాలలు ప్రయాణికుల రద్దీగా సరిపడా లేవు. టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేదు. ప్రయాణికులకు రద్దీకి సరిప డా సర్వీసులు కల్పించడం లేదు. జిల్లాకేంద్రంలో కొత్తగా నిర్మిం ఠచిన బస్‌షెల్టర్ వేములవాడ, కరీంనగర్ ప్రయాణికులు నించునేందుకు కూడా వీలు లేకుండా ఉంది. అక్కడ కేవలం బస్సు లు నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఎన్నిసార్లు సమస్యలపై మొరపెట్టినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి బస్టాండ్‌లో వసతులు కల్పిం చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బస్టాండ్‌కు ఎప్పుడు వచ్చినా ఇబ్బందులే

కామారెడ్డి బస్టాండ్‌కు ఎప్పుడొచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. ఆర్టీసీ అధికారులు మరమ్మతుల సంగతే మరచిపోయారు. వర్షం పడినప్పు డు గుంతల్లో నీరు చేరి ఆ ప్రాంతమంతా బురదమయంగా మారుతున్నది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్టాండ్‌కు వస్తారు. ప్రయాణికులకు రద్దీకి సరిపడా సర్వీసులు కల్పించడం లేదు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ అయినా అధికారులకు పట్టింపు లేదు. అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్‌ను ప్రయాణికులకు అనుకూలంగా మార్చాలి.

 - భాస్కర్‌రెడ్డి, ప్రయాణికుడు, రామేశ్వర్‌పల్లి

ప్రయాణికులకు సౌకర్యాలు లేవు..

చినుకు పడితే కామారెడ్డి బస్టాండ్ చిత్తడిగా మారుతున్నది. బస్టాండ్‌లో ప్రయాణికులకు మరిన్ని వసతులు కల్పించాలి. సరైన వసతులు లేక చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్‌లో కనీసం తాగునీటి వసతి కూడా లేదు. దీంతో బయట షాపుల్లో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండటం లేదు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌కు ఇంకా ఎక్కువ సర్వీసులు కేటాయించాలి.
 
- లక్ష్మణ్, ప్రయాణికుడు, ఎల్లారెడ్డి
ప్రయాణికులకుఇబ్బందులు లేకుండా చూస్తాం

కామారెడ్డి బస్టాండ్  పరిధిలో ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తాం. బస్టాండ్‌లో ఏర్పడిన గుంతలను పూడ్పిస్తాం. మరమ్మతుల నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడతాం. ప్రయాణికుల కోసం ట్యాంకర్ ద్వారా తెప్పించి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఇతర సౌకర్యాలపైనా దృష్టి సారిస్తాం.

 - ఇందిరా, డిపో మేనేజర్, కామారెడ్డి