4 July, 2026 | 1:44 AM

నీదా నాదా!

26-05-2024 12:45 AM

మండు వేసవిలో నిండు వినోదాన్ని పంచిన ఐపీఎల్ 17వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. లెక్కకు మిక్కిలి రికార్డులు, ఎన్నెన్నో నయా ఫీట్లు, అచ్చెరువొందే  బ్యాటింగ్ ప్రదర్శనలు.. నభూతో అనిపించే బౌలింగ్ స్పెల్స్‌తో రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్లో నేడు తుది సమరం జరగనుంది!

లీగ్ దశలో దుమ్మురేపి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే టైటిల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని చూస్తుంటే.. మూడోసారి తుదిపోరుకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ద్వితీయ విఘ్నాన్ని దాటాలని భావిస్తోంది!!

క్వాలిఫయర్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం పాలైన హైదరాబాద్.. దెబ్బకు దెబ్బ కొట్టాలని యోచిస్తుంటే.. సంచలనాలకు అవకాశమివ్వకుండా జోరు కొనసాగించాలని కోల్‌కతా కృతనిశ్చయంతో ఉంది. చెపాక్‌లో స్పిన్నర్లు పాత్ర కీలకం కానుండగా.. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది!

చెన్నై: ఆటగాళ్ల కొనుగోలు నుంచి.. జట్టు ఎంపిక వరకు, పిచ్‌ల రూపకల్పన నుంచి.. బ్యాటర్ల దృక్పథం వరకు ప్రతి దాంట్లో వైవిధ్యం చూపించి.. అసలు మైదానంలో ఆడుతున్నది హైదరాబాదేనా అనే అనుమానం వచ్చేలా చేసిన సన్‌రైజర్స్ జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన రైజర్స్.. క్వాలిఫయర్ టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఓడినా.. క్వాలిఫయర్ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తుదిపోరుకు అర్హత సాధించింది.

ఆదివారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ‘కప్పు కొట్లాట’లో మరోసారి కోల్‌కతాతో అమీతుమీకి సిద్ధమైంది. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి హైదరాబాద్ ఆటతీరు పూర్తి భిన్నంగా సాగగా.. ఆస్ట్రేలియా టెస్టు సారథి కమిన్స్ కెప్టెన్సీ రైజర్స్‌ను విభిన్న జట్టుగా తీర్చిదిద్దింది. తుది వరకు కొట్లాడటం.. ఆఖరి బంతి వరకు ఓటమిని అంగీకరించకపోవడం.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం ఇలా.. ప్రతి అంశంలో మెరుగ్గా కనిపించిన సన్‌రైజర్స్.. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్‌కు చేరింది. 2016 టైటిల్ గెలిచిన రైజర్స్, 2018లో రన్నరప్‌గా నిలిచింది.

మరి ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ రెండో సారి ట్రోఫీ ముద్దాడుతుందా చూడాలి. మరోవైపు మెంటార్ గౌతమ్ గంభీర్ రాకతో పూర్తిగా మారిపోయిన కోల్‌కతా.. మూడోసారి కప్పు అందుకోవాలని తహతహలాడుతోంది. నరైన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపడం.. సాల్ట్‌పై నమ్మకముంచడం.. స్టార్క్ అనుభవాన్ని వాడుకోవడం ఇలా ప్రతి దాంట్లో వైవిధ్యం చూపిన కోల్‌కతా మెంటార్ గంభీర్.. కేకేఆర్‌ను అజేయ జట్టుగా నిలిపాడు. మరి రెండోసారి ఈ రెండు జట్ల మధ్య పోరు జరగనుండగా.. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. రైజర్స్ చివరి చెపాక్ పిచ్‌పై ఆడటం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు శనివారం చెన్నైలో భారీ వర్షం కురవడం అభిమానులను కలవరపెడుతోంది.

సమతూకంగా కేకేఆర్

కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండుసార్లు ట్రోఫీ అందించిన గౌతమ్ గంభీర్ రాకతో ఆ జట్టు దృక్పదంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అచ్చం హైదరాబాద్‌లాగే ఆ జట్టుకు కూడా ఓపెనర్లే ప్రధాన బలం. గంభీర చేసిన ప్రయోగం సఫలమవడంతో నరైన్ స్టార్ బ్యాటర్ల కంటే ఎక్కువ పరుగులతో దుమ్మురేపుతుండగా.. మిడిలార్డర్‌లో ఐయ్యర్ ద్వయం (శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్), నితీశ్ రాణా, రింకూ సింగ్, రస్సెల్ విజృంభిస్తున్నారు. బౌలింగ్‌లో నరైన్, వరుణ్ కోల్‌కతా ప్రధానాస్త్రాలు కాగా.. స్టార్క్ ఫామ్ అందిపుచ్చుకోవడం కేకేఆర్‌కు సానుకూలాంశం. రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో స్టార్క్ తన రెండో బంతికే హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. చెపాక్ పిచ్‌పై మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించడం ఖాయమే కాగా.. నరైన్, వరుణ్ నుంచి రైజర్స్‌కు ముప్పు పొంచి ఉన్నట్లే.