22-01-2026 12:10:11 AM
ఎమ్మెల్యే పాయల్ సమక్షంలో బీజేపీ లో యువకుల చేరిక...
ఆదిలాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశ రక్షణకై అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై యువకులు బీజేపీ వైపు చూస్తున్నా రని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే అన్ని రాజకీయ పార్టీలకు వెనుకబడిన కే.ఆర్.కే కాలనీ గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. బుధవారం కే.ఆర్.కే కాలనీకి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పటివరకు గెలిచిన కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు ఎన్నడూ కే.ఆర్.కే కాలనీ ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. కే.ఆర్.కే కాలనీలో రోడ్లపై నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను సొంతగా తాత్కాలికంగా రోడ్ల సౌకర్యం కల్పించనని గుర్తు చేశారు. వేసవి కాలంలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తమ పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్ లను పంపించడం జరిగిందన్నారు.
మీ ఆశీర్వాదంతో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లు గెలిచిన తర్వాతనే కేఆర్కే కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందుచేతనే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీజేపీ కి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు రాహుల్, రాము, రత్నాకర్ రెడ్డి, దయాకర్, సాయి, రాము, పద్మ, రేఖ, కాలనీ వాసులు పాల్గొన్నారు.