22-01-2026 12:10:36 AM
కరీంనగర్ క్రైం, జనవరి 21 (విజయక్రాంతి): గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో ట్రాఫిక్ విధుల్లో అత్యంత సమర్థవంతంగా, క్రమశిక్షణతో వి ధులు నిర్వహించిన ఎన్సిసి క్యాడెట్ల సేవలను గుర్తించి వారిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు. బుధవారం కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో క్యాడెట్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల వంటి కీలక సమయాల్లో పోలీసు శాఖకు అండగా నిలిచి, శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్సిసి క్యాడెట్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారిలోని సేవా దృ క్పథం, సమయపాలన అభినందనీయమని పేర్కొన్నారు.
క్యాడెట్లను సమన్వయం చేస్తూ పోలీసు శాఖకు పూర్తి సహకారాన్ని అందించిన ఎన్సిసి అధికారులను సీపీ శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా భవిష్యత్తులో కూడా ఎన్సిసి క్యాడెట్ల సేవలను వినియోగించుకుంటామని సీపీ వెల్లడించారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యం కావడం వల్ల వారికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు వెంకటరమణ, భీంరావు, కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కృష్ణ,సుబేదార్ మేజర్ సాగర్ సింగ్, మేజర్ రవీంద్ర బాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.