గంజాయి మత్తులో యూత్!
మహేశ్వరం, జూన్ 6 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలో గంజాయి బానిసలు పెరుగుతున్నారు. వీరిలో 15 - 25 ఏళ్ల మధ్య వయస్కుల వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాదర్‌గూల్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, బాలాపూర్, జల్‌పల్లి ప్రాంతాల్లో విద్యాసంస్థలు టార్గెట్‌గా విక్రయాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల సమీపంలోని పాన్‌షాపులు, చిన్నపాటి కిరాణా దుకాణాలను అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని నేరుగా కాకుండా.. వివిధ రూపాల్లోకి మార్చి చాకెట్లు, బిస్కెట్లు, కేకుల లాంటి తినుబండారాల ద్వారా యువతకు అలవాటు చేసి వాటికి బానిసలుగా మార్చుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి వ్యాపారం నిరంతరాయంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు చిక్కకుండా సరఫరా
గంజాయి విక్రయించే వాళ్ళు పోలీసులు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి సరఫరా చేసేవారు. కానీ ఈ మధ్య చాకెట్ల రూపంలో గంజాయి సరఫరా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తరుచూ పాన్‌షాపులు, విద్యార్థులు పట్టుబడినప్పుడు వారి వద్ద ఎక్కువగా చాకెట్ల రూపంలోనే గంజాయి లభ్యమవుతుంది. ఈ గంజాయి సరఫరా చెయిన్ సిస్టంలా సాగుతోంది. రద్దీగా ఉండే బస్టాండ్‌లతో పాటు చౌరస్తాలు, పార్కులు గంజాయి అమ్మేవాళ్లకు అడ్డాగా మారుతున్నాయి.
మాదక ద్రవ్యాలను తీసుకున్న వారిలో మార్పులు..
మాదక ద్రవ్యాలలో పలు రకాలు ఉన్నాయి.వాటిలో గంజాయి కూడా ఒక్కటి. ముందుగా సరదాగా మొదలై ఆ తరువాత అలవాటుగా మారుతుంది. రోజంతా నిషా లో మునగడానికి ఇదోరకం అలవాటు. చాలా వరకు ప్రజల్లో కాకుండా వీరు నలుగురు,ఐదుగురు మాత్రమే గుంపుగా ఉంటారు. ఒక్కోసారి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతారు.మత్తు పదార్థం తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థపై పని చేసి అవయావలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మత్తులో ఉన్నవారిలో మెదడు,శరీర పనితీరు మందగిస్తుంది. శరీరంలో ఉద్రేకాన్ని కలిగిస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగేలా చేస్తుంది. దీంతో వారు పిచ్చిగా ప్రవర్తిస్తారు. మత్తులో గొడవలకు దిగాతారు. ఆ సమయంలో శరీరంపై దాడి జరిగిన అంతగా పట్టించుకోరు. శాడిస్టులా మారుతారు.






