యువశక్తే విశ్వగురువు
- వారిని దిశానిర్దేశం చేస్తే దేశానికి ప్రయోజనం
- ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో అవసరమే
- అస్థిర ప్రపంచానికి భారత్ మార్గం చూపాలి
- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ముంబై, ఆగస్టు 16: యువశక్తిని సరైన రీతిలో వాడుకుంటే విశ్వగురువుగా భారత్ అవతరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశానికి యువ జనాభా ఒక వరమని, వారిని సరైన దిశలో తీర్చిదిద్ది, దిశా నిర్దేశం చేస్తే దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో కస్తూర్చంద్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల కు ఉపయోగపడే అంశాలను ప్రస్తావించే విపక్షం, ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో అవసరమన్నారు.
రాజ్యాంగానికి, చట్టాలకు భంగం కలిగించకుండా చర్చలు, వాదనలు కొనసాగాల్సిందేనన్నారు. నేటి యువత తమకోసం కాకుండా దేశ భవిష్యత్ తరాల కోసం ఆలోచించాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్ వంటి దేశాల కన్నా భారతదేశం భిన్నమైనదని యువత ముందుగా అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి, ప్రగతి కోసం అది తన సొంత ప్రమాణాలను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం అసంపూర్ణమైన ఆలోచనలతో ప్రపంచం తడబడుతుందని, భారత్ ప్రపంచానికి భవిష్యత్ మార్గాన్ని చూపే ఆలోచనలు చేయాలని, దీంతో సమతుల్యత తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకు దేశ యువత సిద్ధంగా ఉండాలని మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారతదేశానికి ప్రపంచదేశాల్లో స్వంత గౌరవం, హుందాతనం, ప్రతిష్ఠ ఉన్నాయని చెప్పారు. దేశ యువత ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించుకునే స్థాయికి ఎదగాలని, కృషి చేయాలని అన్నారు.






