పేదల పెన్నిధి వైఎస్సార్: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
చిట్యాల,(విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన గొప్ప వ్యక్తి వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం వైఎఎస్సార్ 16 వ వర్ధంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత వైయస్సార్ కి దక్కుతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సేవలు మరువ లేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






