అస్తవ్యస్తంగా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి!
- ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
- డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కఠిన చర్యలకు ఆదేశం
- హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి
జహీరాబాద్, ఆగస్టు 28 : జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతిరోజు దాదాపు 1000 మందికి పైగా ఔట్ పేషెంట్లు వచ్చినప్పటికీ సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. రోగికి అవసరం లేని పరీక్షలు నిర్వహిస్తూ అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు ఉన్నప్పటికీ వారు సక్రమంగా డ్యూటీ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉదయం అవుట్ పేషంట్లను చూసేందుకు పాత భవనంలో, మధ్యాహ్నం తర్వాత కొత్త భవనంలో పేషంట్లను వైద్యం చేస్తుంటారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపి చూసిన డాక్టర్లు తమ ఇళ్లకు వెళ్లిపోతుంటారు మధ్యాహ్నం తర్వాత డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉండి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ సకాలంలో డ్యూటీ డాక్టర్ ఆసుపత్రిలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు చెబుతున్నారు. ప్రతిరోజు వెయ్యికి పైగా వచ్చే రోగులను పరీక్షించేందుకు వైద్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ రోగుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతుంటారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జరిగిన ఓ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు.
వీరు చనిపోయిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం పంచనామా నిర్వహించేందుకు సరైన ప్రక్రియ జరగకపోవడంతో ఆలస్యమైనట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడి రోగులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత, డ్యూటీ డాక్టర్ గైర్హాజరు, ప్రైవేట్ డాక్టర్ తో చికిత్సపై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా క్రిస్టినా జెడ్ చొంగ్తుతో మాట్లాడారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి లో జరిగిన ఘటనపై విచారణ కు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ స్థానంలో విధుల్లో ప్రైవేట్ డాక్టర్ ఉండటం, డాక్టర్ల గైర్హాజరు పై మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






