30 August, 2026 | 2:45 AM

డిజిటల్ మాయలో జెన్ ఆల్ఫా

30-08-2026 12:00 AM

సాంకేతికత మానవాళి జీవనశైలిని అత్యంత వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ మార్పు ప్రభావం అందరి కంటే ఎక్కువగా ప్రస్తుత 7 నుంచి 15 ఏళ్ల వయసున్న ‘జెన్ ఆల్ఫా’ తరంపైనే స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద తరాల వారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేవి రెండు వేర్వేరు ప్రపంచాలుగా అనుభవంలోకి వస్తే, జెన్ ఆల్ఫా పిల్లలకు మాత్రం ఆ తేడానే తెలియదు. వారి దృష్టిలో డిజిటల్ మాధ్యమమే అసలైన ప్రపంచం. చేతిలోని స్మార్ట్‌ఫోన్ కేవలం సమాచారాన్ని లేదా వినోదాన్ని ఇచ్చే పరికరం కాదు, వారు రోజువారీగా జీవించే ఒక ప్రతిధ్వని కుహరంగా మారిపోయింది.

దేశంలోని మెట్రో నగరాల్లో అడ్వర్టుజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) నిర్వహించిన ‘వాట్ ది సిగ్మా?’ అధ్యయనం ఈ తీవ్రమైన పరిణామాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ నూతన తరం ఇంటర్నెట్‌తో పాటు స్వేచ్ఛగా ఎదగడం లేదని, దానికి బదులుగా డిజిటల్ నెట్‌వర్క్‌లోనే ‘ఇరుక్కుపోతోంది’ అని నివేదిక హెచ్చరించడం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. నేటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినోదానికి, వాణిజ్యానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియో గేమ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ వ్లాగ్స్ వంటి మాధ్యమాల్లో పిల్లలు చూసే ప్రతి విషయాన్నీ స్పాన్సర్డ్ కంటెంట్ ఆక్రమిస్తోంది.

ఒకప్పుడు టెలివిజన్ మాధ్యమంలో ప్రకటనలు ఒక నిర్దిష్ట సమయానుకూల విరామం తీసుకొని ప్రసారమయ్యేవి. కానీ, ఆన్‌లైన్ వేదికల్లో అసలైన కంటెంట్ ఏదో, దాగివున్న వ్యాపార ప్రకటన ఏదో గుర్తించడం పిల్లలకు ఎంతో సంక్లిష్టంగా మారింది. ఏఎస్‌సీఐ అధ్యయనం ప్రకారం, 7 నుంచి 12 ఏళ్లలోపు చిన్న పిల్లలు నేరుగా వచ్చే ప్రకటనలను మాత్రమే గుర్తించగలరు. ఇన్‌ఫ్లుయెన్సర్లు కంటెంట్‌లో కలిపేసి ప్రచారం చేసే బ్రాండ్లు, గేమింగ్ యాప్‌లలో లభించే కొనుగోలు లింకులు వారికి వినోదంగానే కనిపిస్తాయి తప్ప, తమను ఒక వస్తువు వైపు ఆకర్షించే వ్యాపార వ్యూహాలని గ్రహించే విచక్షణా శక్తి వారికి ఇంకా రాలేదు.

ఇక 13 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలు ఆ ప్రకటనలను గుర్తుపట్టగలిగినప్పటికీ, బ్రాండ్లు అల్గారిథమ్ సహాయంతో రూపొందించే భావోద్వేగ కథనాలకు సులభంగా లొంగిపోతున్నారు. ఇది వారి జీవనశైలిని, కొనుగోలు ప్రవర్తనను పరోక్షంగా శాసిస్తోంది. మరోవైపు, ఇంతటి వేగవంతమైన డిజిటల్ మార్పులకు అనుగుణంగా తమ పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు అచేతనత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, తమ పిల్లల డిజిటల్ జగత్తులో తల్లిదండ్రులు డిజిటల్ నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు.

అల్గారిథమ్‌లు నిరంతరం పిల్లల ఆసక్తులను విశ్లేషిస్తూ అతని ఆలోచనలను ఏ దిశగా నడిపిస్తున్నాయో తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. కంటెంట్‌లోని ప్రమాదాలను పసిగట్టలేకపోవడం, స్క్రీన్ సమయంపై నియంత్రణను అమలు చేయలేకపోవడం తల్లిదండ్రుల నిస్సహాయతను ఎత్తిచూపుతోంది. ఈ పరిస్థితుల్లో జెన్ ఆల్ఫాను విమర్శించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. డిజిటల్ ప్రపంచంలోనే జన్మించి పెరుగుతున్న ఈ తరాన్ని సాంకేతికతకు పూర్తిగా దూరం చేయడం అసాధ్యం. అయితే దాని ముసుగులో జరుగుతున్న వ్యాపార శోషణ నుంచి వారిని రక్షించడం తక్షణ అవసరం.

దీని కోసం ప్రభుత్వం, పాఠశాలలు, డిజిటల్ వేదికలు, తల్లిదండ్రులు ఒక ఉమ్మడి సమగ్ర వ్యవస్థగా ఏర్పడాలి. పాఠశాలల స్థాయిలో డిజిటల్ అక్షరాస్యతతో పాటు వ్యాపార ప్రకటనల వెనుక ఉండే ఉద్దేశాలను విశ్లేషించే ‘మీడియా లిటరసీ’ బోధనను చేర్చాలి. యూట్యూబ్, మెటా వంటి బహుళజాతి సంస్థలు పిల్లల కోసం ప్రత్యేకమైన పారదర్శక నిబంధనలను అమలు చేస్తూ, స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా సూచించే ట్యాగ్‌లను తప్పనిసరి చేయాలి. కంటెంట్ క్రియేటర్లు కూడా నైతిక భావనతో వ్యవహరించాలి.

తల్లిదండ్రులు సైతం కేవలం పిల్లల చేతిలోని ఫోన్ లాక్కోవడంతో సరిపెట్టకుండా, బాధ్యతాయుతమైన డిజిటల్ సరిహద్దులను ఏర్పరచాలి. వారంతాల్లో డిజిటల్ డిటాక్స్ పాటించడం, పిల్లలను మైదానాలకు తీసుకెళ్లడం, పుస్తక పఠనం, ప్రత్యక్ష సామాజిక సంబంధాల వైపు ప్రోత్సహించడం చాలా ముఖ్యం. భావి భారత్‌కు ప్రతిరూపమైన జెన్ ఆల్ఫాను వాణిజ్య విష వలయం నుంచి కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత.

వ్యాసకర్త: జర్నలిస్టు, 8985278362

శెట్టే అంజయ్య