మణిపూర్‌లో మళ్లీ హింస
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్‌పోక్పీ జిల్లాలో ఇటీవల జరిగిన బాంబు దాడిలో నాగా సామాజికవర్గానికి చెందిన నలుగురు చనిపోగా, ఈ దాడికి కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్ సంస్థలే కారణమని ఆరోపణలు వస్తుండటం కలవరపెడుతున్నది.
ఈ ఘటనను మరువకముందే అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి జరగడం ఈశాన్య రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల తీవ్రతను చెప్పకనే చెప్తున్నది. ఈ రెండు ఘటనలకు పరస్పర సంబంధం ఉందా, లేదా? అన్నది ఇంకా తెలియనప్పటికీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధి నివాసంపై దాడి జరగడం సాధారణ విషయమేమీ కాదు. హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం శోచనీయం.
కాగా, మూడేళ్ల క్రితం మైతేయి తెగకు గిరిజన హోదా కల్పించాలన్న డిమాండ్‌తో మణిపూర్‌లో అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారకపోవడం బాధాకరం. మైతేయి, కుకీ తెగల మధ్య రాజుకున్న నిప్పు సెగలు నాగా సామాజికవర్గానికి తాకడం కలవరపాటుకు గురిచేస్తున్నది. మొదట్లో ఈ ఘర్షణలకు దూరంగానే ఉన్న నాగా ప్రజలు కూడా హింసలోకి లాగబడుతుండటం సమస్య మరింత సంక్లిష్టంగా మారుతున్నదనడానికి తార్కాణం.
2023లో మొదలైన ఈ అల్లర్లలో ఇప్పటివరకు 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇంతటి భారీ ప్రాణ నష్టం జరిగినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది. తొలినాళ్లలో పరిస్థితులను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన అప్పటి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చివరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన కొనసాగినా పరిస్థితిలో మార్పు రాలేదు.
ఇప్పుడు ఖేమ్‌చంద్ సింగ్ పాలనలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరగడం పెను సవాలుగా మారింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. దీంతో పాలకుల మార్పుతో ఈ సమస్యకు పరిష్కారం లభించదని తేలిపోయింది. జాతుల మధ్య పెరుగుతున్న అనుమానాలు, పరస్పర ద్వేషాన్ని రూపుమాపడమే సమస్యకు అసలై న పరిష్కార మార్గమని చెప్పక తప్పదు. ఈ తరుణంలో అన్ని వర్గాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలను చూడాల్సి రావచ్చు.






