జిల్లాకో పబ్లిక్ స్కూల్!
వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు
ఇప్పటికే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. నిరు పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మండలానికో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తెలంగాణ పబ్లిక్ (ఇంటర్నేషనల్) స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటి విడతలో భాగంగా మండలానికో స్కూల్ కాకుండా జిల్లాకో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ముందస్తుగా ఈ విద్యాసంవత్సరం నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావించింది. అందులో భాగంగానే ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం పైలట్ ప్రాజెక్టు కింద రూ.500 కోట్ల నిధులను సైతం కేటాయించారు. వీటి నిర్మాణానికి సంబంధించి అనువైన స్థలాలను, స్కూళ్లను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. కానీ ఈలోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో దాదాపు మూడు నెలలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా అయింది.
పైగా జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం కూడా ప్రారంభం కానుంది. మొదటగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ ఇప్ప ట్లో ఇది సాధ్యం కాకపోవడంతో ఈ ఏడాది కొన్ని స్కూళ్ల నిర్మాణం చేపట్టి వచ్చే 2024 25 విద్యాసంవత్సరం నుంచైనా వీటిని వినియోగంలోకి తేవాలని విద్యాశాఖ ఉన్నతాధి కారులు భావిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక ప్రమాణాలతో అన్ని వసతులు ఉండేలా స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్ ల్యాబ్ లు, ఆట స్థలం ఉండేలా, విశాలమైన తరగతి గదులు ఏర్పాటు చేసి డిజిటల్ విద్యనూ అందుబాటులోకి తేనున్నారు.
ఏ విధంగా ఉంటాయి?
ఇప్పటికే రాష్ట్రంలో మోడల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మండలానికి ఒకటి కొనసాగిస్తున్నారు. కస్తూర్బా పాఠశాలలు బాలికల కోసం నిర్వహిస్తుండగా, మోడల్ స్కూళ్లో మాత్రం కో కేషన్ అమలవుతోంది. వీటికి తోడూ రాష్ట్రం లో బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కొన్ని చోట్ల విద్యార్థులు లేక పాఠశా లలు మూతబడుతున్నా యి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తేవాలను కుంటున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏవిధంగా ఉండబోతాయనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. కొత్తగా నిర్మిస్తారా? లేదంటే కొన్ని నిర్మించి, ఇప్పటికే ఉన్న మోడల్, గురుకులాలకు తెలంగా ణ పబ్లిక్ స్కూళ్లగా మార్చుతారా? అనేది చూడాల్సిఉంది.






