ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు
గద్వాల : ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని జెడ్పి చైర్ పర్సన్ సరిత విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 30వ వార్డ్ ప్రాథమిక పాఠశాల, 32వ వార్డ్ లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ముందుగా విద్యార్థిని, విద్యార్థులకు జెడ్పి చైర్ పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్ చేతులమీదుగా పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో నాణ్యత గల మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారన్నారని ఒక మీటింగ్ లో స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు సూదన్ బాబు, అమరావాయి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఇసాక్, డిటిడిసి నర్సింహులు, నాగేంద్ర యాదవ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.






