అచ్చంపేటలో నెగ్గిన మున్సిపల్ అవిశ్వాసం.!
నాగర్ కర్నూల్ : జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ అలసత్వం, వ్యవహార శైలి పట్ల విసిగి వేసారిన మున్సిపాలిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ స్థానిక ఆర్డిఓ కే. మాధవిని ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించి బుధవారం అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. దీంతో అచ్చంపేట మున్సిపాలిటీ 20 మంది కౌన్సిల్ సభ్యులకు గాను 16 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిపి 17 మంది చేతులు ఎత్తి అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గిందని ప్రకటించారు. అనంతరం గార్లపాటి శ్రీనివాసులను మున్సిపల్ చైర్మన్ గా నియమించేందుకు కౌన్సిల్ సభ్యులంతా మద్దతు తెలియజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రకటిస్తామని ఆమె తెలిపారు.






