పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి
గద్వాల : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ పేర్కొన్నారు. బుధవారం గద్వాల మండలం పరమాల గ్రామ శివారు వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా ఉంటేనే వాళ్లు చదువులో రాణిస్తారని, గతేడాది 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి రెండో స్థానంలో నిలవడానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడమే ప్రధాన కారణం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభగల ఉపాధ్యాయులు ఉంటారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య, రాత పుస్తకాలు అందజేయడమే కాక మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతోమంది ఉన్నతోద్యోగాలు సాధించారని, ప్రజా ప్రతినిధులుగాను రాణిస్తున్నారని చెప్పారు. ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఎన్నుకొని అవసరమైన మరమ్మత్తులు చేయించడంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో దుస్తులను కుట్టించినట్లు తెలిపారు.
ఫలితంగా ప్రభుత్వం తరఫున మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రతివారం పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను తెలియజేయడమే కాక, పిల్లలను పనికి పంపకుండా తప్పకుండా బడిలో చదువుకునేలా సహకరించాలని కోరాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 14 ఏళ్లలోపు బాలబాలికలందరూ తప్పకుండా పాఠశాలలో చదువుకోనెలా చూడాలని, తల్లిదండ్రులు వాళ్లతో పని చేయించడం చట్టరీత్య నేరం అని చెప్పారు. పిల్లలను బాగా చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని, గొప్ప స్థాయిని చేరుకునే అవకాశం ఉందన్నారు.






