54 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూపం
న్యూ బొప్పారం ఆలయంలో 66 కిలోల చందూరం తొలగింపు.
నిర్మల్ నవంబర్ 21 ( విజయక్రాంతి) : శ్రీరాంసాగర్ జలాశయం(Sriramsagar Reservoir) నిర్మాణ సమయంలో ముంపునకు గురైన సోన్ మండలంలోని(Son Mandal) న్యూ బొప్పారం గ్రామంలో 1972లో నిర్మించిన హనుమాన్ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆలయం నిర్మించిన నాటి నుంచి గ్రామస్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి సందర్బంగా హనుమాన్ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయి 54 సంవత్సరాలు కావడంతో స్వామివారికి అలంకరించిన చందూరాన్ని శనివారం తొలగించారు.
సుమారు 66 కిలోల చందూరాన్ని తొలగించడంతో హనుమంతుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తొలగించిన చందూరాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం ఒడిబియ్యం సమర్పణ, బుధవారం హనుమాన్ పండుగ, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి, ఉదయ్, అజయ్, తోట ఉదయ్, వినయ్, సతీష్, గణేష్, శివ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.