వసతి గృహం పిల్లలతో కాలక్షేపం చేసిన కలెక్టర్

21-11-2026 | 03:30pm

నిర్మల్,(విజయక్రాంతి): బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలతో  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) కలిసి మాట్లాడారు. జాతీయ బాలల దినోత్సవం(National Children's Day) వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామంలో గల బాలసదనాన్ని సందర్శించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లలందరికీ అన్ని వసతులు కల్పించాలన్నారు. చిన్నారులతో నేరుగా మాట్లాడి వారి వివరాలు, బాలసదనంలో సౌకర్యాలు, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని, వారి జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని తెలిపారు. బాలసదనం అధికారులతో మాట్లాడుతూ, చిన్నారులకు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు విమానాల్లో సందర్శనకు తీసుకువెళ్లాలని సూచించారు. ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో వారికి సందేశాత్మకమైన, వారి మనోస్థైర్యం నింపేలా మంచి మంచి సినిమాలు ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న, అధికారులు మురళి, వైష్ణవి, రాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు