'చలో హైదరాబాద్'ను విజయవంతం చేయండి
సాలూర, నవంబర్ 27(విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(Central and state governments) ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'ప్రజా గర్జన'(Praja Garjana) మహాసభకు ప్రజలు, కార్మికులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ పిలుపునిచ్చారు.
శుక్రవారం సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ, అమిత్ షా నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం దేశ మౌలిక సమస్యలను గాలికి వదిలేసి, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఫాసిస్టు పోకడలను అనుసరిస్తోందని ఆయన విమర్శించారు.
దేశ సంపదను, కీలక వనరులను ఆదానీ, అంబానీలతో పాటు విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తున్నప్పటికీ, కొత్త ఉద్యోగాల కల్పన గానీ, ఉన్న ఉద్యోగులకు వేతనాల పెంపు గానీ జరగడం లేదని స్వయంగా ప్రధాని మోదీయే అంగీకరించారని పేర్కొన్నారు.
'సర్' పేరుతో దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, పేద వర్గాలకు చెందిన 13.40 కోట్ల ఓట్లను తొలగించారని, ఏకపక్షంగా గెలవాలనే కుట్రతోనే జ్ఞానేశ్ కుమార్‌ను తెచ్చారని ఆరోపించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు, ప్రస్తుతం జీఎస్టీ పేరుతో సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కార్మిక కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలు, ఉపా వంటి నిర్బంధ చట్టాలను రద్దు చేసే వరకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
మరోవైపు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బి.మల్లేష్ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, పెన్షన్ల మంజూరుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వీటి సాధన కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, నాయకులు బి.సాయులు, జి.నాగేష్, జి.దేవయ్య, టి.గంగారాం, అంజయ్య, గంగాధర్, నారాయణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.