పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
పేకాట ఆడినా.. ఆడించినా కఠిన చర్యలు తప్పవు
ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచుతాం
బోధన్, నవంబర్ 05 (విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్(Nizamabad Police Ban) కమిషనరేట్ పరిధిలో పేకాటను పూర్తిగా నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో ఎవరైనా పేకాట ఆడినా, పేకాట స్థావరాలు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు పేకాట నిర్వహించే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. పేకాట ఆడటంతో పాటు ఇతరులను ప్రోత్సహించినా, పేకాట స్థావరాల నిర్వహణకు సహకరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నా, ఆడిస్తున్నా లేదా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసినా వెంటనే నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్(Nizamabad Police Control Room) నంబర్ 8712659700 కు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజలు పోలీసులకు సహకరించి దీపావళి పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.