జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి
కాలువల పూడికతీత పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
ఓదెల మండలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): వీబీజీ రామ్జీ పథకాన్ని(VB-G RAM G scheme) సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) అధికారులను ఆదేశించారు. శనివారం ఓదెల మండలంలోని గోపరపల్లి, హరిపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాల్లో సాగునీటి కాలువల పూడికతీత పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కాలువల్లో పూడిక తొలగించడం ద్వారా సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించి రైతులకు మెరుగైన నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కూలీల హాజరు, పనుల కొలతలు, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. చేపట్టిన ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఓదెల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి పథకం అమలు, పనుల పురోగతి, కార్యాలయ నిర్వహణపై సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో అనిల్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.