నామినేటెడ్ తో... నష్టాలు...
- సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి...
- రైతులు ఎన్నుకునే వాడే నాయకుడు కావాలి...
- రైతుల అభ్యర్థన...
తాడ్వాయి,అక్టోబర్, 28( విజయ క్రాంతి ): ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(Government Primary Agricultural Cooperative Society) నామినేటెడ్ పద్ధతిలో పదవులు ఎంపిక చేయడంతో నష్టాలు ఏర్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటేనే రైతులకు చేదోడు వాదోడుగా ఉండే సామూహిక స్నేహ సంఘం.ఈ సంఘంలో రైతులు ఎన్నుకునే వాడే నాయకుడు కావాలి.
అలాంటి నాయకుడే రైతుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాడు.కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగాt నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాలకు చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఎంపిక చేస్తున్నంతో సంఘాలకు,రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.ఈ విధానంలో ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో సహకార సంఘాలకు ప్రభుత్వం నామినేటెడ్ పద్దతిలో చైర్మన్, డైరెక్టర్లను ఎంపిక చేసింది. అందులో కొందరు అసలు రైతుల కష్టాలు తెలిసిన వారు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి.
సహకార సంఘానికి చైర్మన్ సీట్ లో కూర్చుండాలంటే ఆయన రైతు అయి ఉండి రైతు సమస్యలు తెలిసినవాడై ఉండాలి.కానీ అసలు రైతే కాకుండా సమస్యలు తెలియని వ్యక్తులను చైర్మన్ కుర్చీలో కూర్చో పెట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి...
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులే ఓట్లు వేసి చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.సదరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చురుకైన వ్యక్తిని చైర్మన్ గా రైతులు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రైతుల కోసం పనిచేసే వ్యక్తినే చైర్మన్ గా ఎన్నుకుంటారు.
తమకు అనుకూలమైన వ్యక్తులనే డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు.ఈ విధానంలో పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పదవులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఒక పార్టీకి చెందిన వారికే పదవులు..
ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్,డైరెక్టర్లను నియమించడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఈ పదవులు అధికార పార్టీకి చెందిన వారినే వరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మిగతా పార్టీలకు చెందిన రైతులు మేము రైతులము కామా మాకు అర్హతలు లేవా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో తమకు ఇష్టమైన అనుకూలమైన వారిని ఎంపిక చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ఇటీవల జిల్లాలో సింగిల్ విండో లకు చైర్మన్,డైరెక్టర్ పదవులను భర్తీ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సమగ్రంగా పరిశీలించి గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించి పదవులు భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.