బడంగ్‌పేట్‌లో ‘నకిలీ’ భూదందా..!?
- అధికారుల అక్రమార్జన
- మాజీ సర్పంచుల సంతకాల ఫోర్జరీ
- నకిలీ ఎల్.ఆర్.ఎస్ కాపీలతో అక్రమ లేఅవుట్లు
- కాసులకు కక్కుర్తిపడి భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు
- రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని చంపాపేట్ సబ్‌రిజిస్ట్రార్‌కు డిప్యూటీ కమిషనర్ లేఖ
- ఆందోళనలో కొనుగోలుదారులు.. విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్
బడంగ్‌పేట్, నవంబర్ 28 (విజయక్రాం తి): నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ మాఫియా(Real estate mafia) అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడు స్తూ, ఏకంగా ఫోర్జరీ పత్రాలతో(Forged documents) అక్రమ వెంచర్లు సృష్టించి కోట్లాది రూపాయల దందా కు తెరలేపిన రియల్ మాఫియా బాగోతం బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో బట్టబయలైంది.
హెచ్.ఎం.డి.ఏ అనుమతులు లేకుం డానే వెంచర్లు వేయడమే కాకుండా, మాజీ సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పంచాయతీ లేఅవుట్ కాపీలు, నకిలీ ఎల్.ఆర్.ఎస్ పత్రాలను సృష్టించారు. వీటికి కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
నకిలీ పత్రాలతో కథ నడిపారిలా
నగర శివారు ప్రాంతాల్లో వెంచర్లు వే యాలంటే హెచ్.ఎం.డి.ఏ అనుమతి తప్పనిసరి. కానీ, బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని భూ బకాసురులు అడ్డదారులు తొక్కారు. గతంలో గ్రామ పంచాయతీలు ఉన్న సమయంలోనే (2018కి ముందు) అనుమతులు పొందినట్లుగా చూపించేందుకు, అప్పటి సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి పాత తేదీలతో నకిలీ లేఅవుట్ కాపీలను తయా రు చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వ రికార్డుల్లో లేని నకిలీ ఎల్.ఆర్.ఎస్ ప్రొసీడింగ్ కాపీలను సృష్టించి వాటి ఆధారంగా వెంచర్లు వేశారు.
సాధారణంగా టీఎస్‌బీపాస్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసినప్పుడు, క్షేత్రస్థాయిలో పత్రాల అసలు, నకిలీలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించాలి. కానీ, సదరు అధికారులు రియల్ మాఫియాతో కుమ్మక్కై భారీగా ముడుపులు పుచ్చుకుని, ఆ అక్రమ ప్లాట్లకు ఏకంగా ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివాదంలో ఉన్న సర్వే నంబర్లు ఇవే
అధికారుల అండదండలతో అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు పొందినట్లు గుర్తించిన ప్రధాన సర్వే నంబర్లు: బాలాపూర్ గ్రామం... సర్వే నంబర్లు 272, 273, 275, 276, 277, 278, 281 మరియు 363, 364, వెంకటాపూర్ సమీపంలో... సర్వే నంబర్ 304 రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన డిప్యూటీ కమిషనర్ ఈ అక్రమాల బాగోతం ప్రస్తుత బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించారు. పైన పేర్కొన్న సర్వే నంబర్లలో ఉన్న భూములు, ప్లాట్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని కోరుతూ చంపాపేట్ సబ్‌రిజిస్ట్రార్‌కు లిఖి తపూర్వకంగా లేఖ రాశారు. దీంతో ఆయా సర్వే నంబర్లలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన ఎల్.ఆర్.ఎస్ ఫీజులు, హెచ్.ఎం.డి.ఏ డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించకుండా రియల్ వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు, లేఅవుట్ నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం వదలాల్సిన 10 శాతం పార్కు స్థలాలు, రోడ్ల విస్తీర్ణం కూడా మాయమైంది.
అధికారులపై వేటు వేయాలి
ఫోర్జరీ పత్రాలను గుర్తించకుండా, ఉద్దేశపూర్వకంగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులను తక్షణ మే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మాజీ సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. చట్టవిరుద్ధం గా జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతుల ను తక్షణమే రద్దు చేసి, అక్రమ వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
మున్సిపల్ అనుమతులు ఉన్నాయని నమ్మి కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ వ్యాపారుల నుంచి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో గత రెండేళ్లలో జారీ అయిన భవన నిర్మాణ అనుమతులన్నింటిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలి. ప్లాట్లు కొనుగోలు చేసే ముందు కేవలం బిల్డింగ్ పర్మిషన్ కాపీలను మాత్రమే నమ్మకుండా, హెచ్.ఎం.డి.ఏ అధికారిక వెబ్‌సైట్‌లో సదరు సర్వే నంబర్‌కు లేఅవుట్ అనుమతి ఉందో లేదో సరిచూసుకోవాలి. అలాగే ఎల్.ఆర్.ఎస్ ప్రొసీడింగ్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన తర్వాతే ముందుకు వెళ్లడం సురక్షితం.