ప్రోటోకాల్ పై మాట్లాడే నైతిక హక్కు సుధీర్ రెడ్డికి లేదు

21-11-2026 | 10:45pm

- జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి 

ఎల్బీనగర్, నవంబర్ 21 : ప్రోటోకాల్(Protocol) పై మాట్లాడే నైతిక హక్కు సుధీర్ రెడ్డికి(Sudheer Reddy) లేదని జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి(Dharpalli Rajashekar Reddy) మాట్లాడుతూ...  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు గతంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలన్నారు. 2009 నుంచి టీడీపీ కార్పొరేటర్లు ఉన్న సమయంలోనే కార్పొరేటర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి చరిత్ర సుధీర్ రెడ్డిదేనని విమర్శించారు.

మొక్కలు నాటే కార్యక్రమంలో అప్పటి ఎంపీ సర్వే సత్యనారాయణను అవమానించి, ప్రోటోకాల్ పాటించకుండా దాడి చేసిన చరిత్ర నీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు ఏనాడైనా ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇచ్చారా? కార్పొరేటర్లను పక్కనపెట్టి.. మీ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో కొబ్బరికాయలు కొట్టించిన రోజులు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు కొత్తపేటకు వచ్చినప్పుడు అడ్డంకులు సృష్టించారని, సరూర్‌నగర్ స్టేడియంలోనూ ఇలాంటి వ్యవహారమే చోటుచేసుకుందని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో మాజీ ఎంపీ  మధుయాష్కీగౌడ్ పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలని సుధీర్ రెడ్డికి సూచించారు. మాజీ కార్పొరేటర్ సుజాత నాయక్  మాట్లాడుతూ.. "నేను ఎస్టీ మహిళను, మాజీ కార్పొరేటర్‌ను. నా హోదాకు తగ్గట్టుగా ఏనాడైనా ప్రోటోకాల్ ప్రకారం గౌరవించారా? సొంత పార్టీలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధినైన నన్నే గౌరవించకుండా అవమానకరంగా వ్యవహరించిన మీరు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని విమర్శించారు.

హస్తినాపురంలో పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్‌తో కొబ్బరికాయలు కొట్టించినప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుధీర్ రెడ్డి పద్ధతిగా  వ్యవహరించకపోతే.. మేము కూడా మా పద్ధతిని సుధీర్ రెడ్డి తెలియజేస్తామని, మేం కూడా హద్దు దాటి వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, డీసీసీ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు