జీహెచ్‌ఎంసీ స్ట్రీట్ లైట్ల కాంట్రాక్టులో రూ.500 కోట్ల గోల్‌మాల్?

06-11-2026 | 05:00am

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation) పరిధిలో వీధి దీపాల నిర్వహణ టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని పెంచడం, బెంచ్ మార్క్ ధర కంటే ఎక్కువ కొటేషన్ వేసిన సంస్థకే టెండర్ కట్టబెట్టడం ద్వారా సుమారు రూ. 500 కోట్ల అక్రమాలు జరిగాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రూ. 1,341 కోట్ల నుంచి రూ. 1,720 కోట్లకు పెంపు..

తొలుత ఈ నగర వీధి దీపాల సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు కోసం అధికారులు రూ. 1,341.60 కోట్లకు పరిపాలనా అనుమతులు  మంజూరు చేశారు. అయితే, ఆ తర్వాత ఏ ప్రాతిపదికన అంచనాలు పెంచారో స్పష్టత లేకుండానే ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ. 1,720.80 కోట్లకు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా టెండర్ కేటాయింపులు?

టెండర్ ప్రక్రియలో పాటించాల్సిన విధివిధానాలను పక్కనబెట్టి కాంట్రాక్ట్ కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి:ఈ కాంట్రాక్టు కోసం బెంచ్ మార్క్ ప్రామాణిక ధరను రూ. 147 గా నిర్ణయించారు. ఎక్కువ ధరకు ఆమోదం. బీఏసీ ఇన్ఫ్రాటెక్  విన్సీ గ్లోబల్ జాయింట్  బెంచ్ మార్క్ కంటే ఎక్కువగా రూ. 153.60 చొప్పున కొటేషన్ దాఖలు చేసింది. సాధారణంగా బెంచ్ మార్క్ కంటే ఎక్కువ కొటేషన్ వస్తే టెండర్ రద్దు చేయడమో లేదా రీ-టెండరింగ్కు వెళ్లడమో జరుగుతుంది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా సదరు జాయింట్ వెంచర్కే మొగ్గు చూపడం వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

సాంకేతిక లోపాలు.. ప్రజాధనం దుర్వినియోగం..

నగరంలో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ, కంట్రోల్ రూమ్ల ఏకీకరణ, విద్యుత్ ఆదా పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో లైట్లు వెలగకపోవడంపై ప్రజల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. అధిక ధరలకు ప్రాజెక్టును అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ. 500 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు