చేవెళ్లలో ‘కెమికల్’ కలకలం
- మూగజీవాలకు మరణశాసనం..
- పర్యావరణం ధ్వంసం
- నల్లబడుతున్న నేలలు.. మొలకెత్తని పచ్చగడ్డి!
- ట్యాంకర్లతో అర్ధరాత్రి దందా.. కనీసం పట్టించుకోని పెట్రోలింగ్ వ్యవస్థ?
- ప్రాసెస్ ఖర్చులకు భయపడే విషాన్ని ఒంపుతున్న పారిశ్రామికవేత్తలు
చేవెళ్ల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నిర్మానుష్య ప్రాంతాలు, పచ్చని ఫామ్ల్యాండ్లు ఇప్పుడు విషపూరిత రసాయన వ్యర్థాలకు నిలయాలుగా మారుతున్నాయి. చేవెళ్ల మున్సిపల్(Chevella municipality) పరిధిలో రాత్రికి రాత్రే టారస్ ట్యాంకర్లలో తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా కుమ్మరిస్తున్న కెమికల్ వాటర్ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అసలు ఈ విషపు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? అనే అంశాలు ఇప్పుడు తీవ్ర ప్రశ్నార్థకంగా మారాయి.
అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా డంపింగ్....
ఈ అక్రమ రసాయనాల పారబోత వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు ముందే ప్రదేశాలను పరిశీలించి (రెక్కీ నిర్వహించి), స్థానికులు నిద్రపోయే సమయాల్లో టారస్ ట్యాంకర్లలో కెమికల్స్ తెచ్చి పారబోస్తున్నారు. కందవాడ రెవెన్యూలోని సర్వే నంబర్ 671 పరిధిలోని వెంచర్లతో పాటు, మమ్ము ధాబా వెనుక భాగం వంటి నిర్మానుష్య ప్రాంతాలనే వీరు అడ్డాలుగా మార్చుకున్నారు. రోజూ కాకుండా నెలల వ్యవధితో పారబోస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
నల్లబడుతున్న భూమి..దెబ్బ తింటున్న పర్యావరణం....
రసాయనాల ధాటికి స్థానిక పర్యావరణం దారుణంగా దెబ్బతింటోంది.వ్యర్థాలు పారిన దాదాపు 500 మీటర్ల మేర నేల నల్లగా మారిపోయి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. విషతుల్యమైన కెమికల్స్ పారిన ప్రదేశంలో చిన్న గడ్డి పరక కూడా మొలకెత్తడం లేదు. భూసారం పూర్తిగా నశించి మృత్తిక క్రమక్షయానికి దారితీస్తోంది. వ్యర్థాలు పారబోసిన స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే రైతులు తమ పశువులను మేపుతుండటంతో ఆ మూగజీవాల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది.ఈ వ్యర్థాల నుంచి వస్తున్న అసహ్యకరమైన కెమికల్ వాసనలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర శ్వాసకోశ, ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు.
సిసి కెమెరాలు ఉన్నా తగ్గని తెగింపు.. నిఘా లోపమేనా?....
అడుగడుగునా సీసీ కెమెరాలు,పోలీసుల నిఘా నేత్రాలు ఉన్నప్పటికీ ట్యాంకర్లలో వచ్చి బహిరంగంగా విషం పారబోస్తుంటే పెట్రోలింగ్ వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రసాయనాలు పారిన చోట మట్టి శాంపిల్స్ సేకరించి, లాబొరేటరీలో పరీక్షలు జరిపితే అది ఏ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థాలో కనిపెట్టడం పోలీసులకు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పెద్ద కష్టమేమీ కాదని స్థానికులు తేల్చిచెబుతున్నారు.
ఈటీపీ ఖర్చు కోసమే ఈ దారుణమా?.....
పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను ఈటీపీ మరియు ఎస్టీపీ లలో శుద్ధి చేసి, జీవ-రసాయన పద్ధతుల ద్వారా విష ప్రభావాన్ని తొలగించిన నీటినే మాత్రమే వినియోగించాలి. కానీ, ఈ శుద్ధి ప్రక్రియకు అయ్యే భారీ ఖర్చును తప్పించుకోవడానికే కొన్ని అక్రమ పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా ప్రజా ఆరోగ్యాన్ని,పర్యావరణాన్ని పణంగా పెడుతూ ఈ రసాయన వ్యర్థాలను నిర్మానుష్య ప్రాంతాల్లో పారబోస్తున్నాయి. ఇప్ప టికైనా అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.