రేవంత్ బైబై

03-11-2026 | 05:30am

సీఎంకు రైతులను ఆదుకునే సోయి లేదు.. కమీషన్లపైనే ఆరాటం 

  1. శ్రీశైలంలో నీళ్లున్నా.. పాలమూరులో పంటలు ఎండుతున్నయ్
  2. చంద్రబాబు కుప్పంలో నీళ్లు పారుతయ్.. మరి, వనపర్తిలో ఎందుకు పారవ్ 
  3. యాసంగి రైతుబంధు వెంటనే విడుదల చేయాలి
  4. వనపర్తిలో ఎండిన పంటలను పరిశీలించిన హరీశ్‌రావు

నీళ్లకు సెలవు.. పంటలకు సెలవు.. త్వరలో ఈ సర్కార్‌కే సెలవు

సీఎంకు రైతులను ఆదుకునే సోయి లేదు.. కమీషన్లపైనే ఆరాటం: హరీశ్‌రావు

వనపర్తి, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంటలు ఎండి రైతులు(Farmers) గోసపడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) పట్టడం లేదని.. ఆయన దృష్టంతా భూములు అమ్మి కమీషన్లు కొట్టడం పైనే ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీళ్లకు సెలవు.. కరెంటుకు సెలవు.. పంటలకు సెలవు చెప్తున్న రేవంత్ రెడ్డికి కూడా సెలవు, టాటా బైబై చెప్పాల్సిన సమయం దగ్గర్లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్‌రెడ్డి చేతగానితనం తెచ్చిన కరువని విమర్శించారు.

శ్రీశైలం జలాశయంలో(Srisailam Reservoir) నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పాలమూరులో పంటలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గం(Wanaparthy Constituency) పెద్దమందడి మండల పరిధిలోని బుర్రవాగు, ఆల్వాల గ్రామాల్లో ఎండిపోయిన పంటలను సోమవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆల్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు ప్రసంగించారు.

సాగునీటి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించకపోవడం, రైతులకు అవసరమైన సమయంలో నీటిని అందించకపోవడం వల్లే పాలమూరు ప్రాంతంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 221 టీఎంసీలు, జూరాలకు 252 టీఎంసీల నీరు వచ్చినప్పటికీ సకాలంలో మోటార్లు నడపకపోవడంతో రైతులు నష్టపోయారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 50 టీఎంసీల నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్నా, కేవలం 18 టీఎంసీలే వినియోగించారని విమర్శించారు.

కుప్పంలో పారుతయ్.. ఇక్కడెందుకు పారవ్?

‘700 కి.మీ దూరంలోని చంద్రబాబు కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. 70 కి.మీ వనపర్తిలో ఎందుకు పారవు? కల్వకుర్తి కింద 50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా.. 18 టీఎంసీలే ఎత్తి రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు నీళ్లు వదిలేశారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ హయాంలో 41 శాతం నీళ్లు వాడుకుంటే.. రేవంత్ పాలనలో 25 శాతానికే పడిపోయిందన్నారు. ‘కళ్లముందు పారుతున్న కృష్ణా నీళ్లను కూడా ఎత్తలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డిలో వారం రోజుల్లో తీసే మట్టి తండు కూడా తీయలేని చేతగాని ప్రభుత్వం ఇది.

నాడు జూరాలకు వరద తాకకముందే మంత్రులకు ఫోన్లు చేసి మోటార్లు నడిపించి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది. ఇప్పుడు ఒక్క అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఢిల్లీలో కూర్చొని మియాపూర్‌లో 500 ఎకరాలు అమ్మి కమీషన్లు కొట్టే ఆరాటం తప్ప.. రైతులను ఆదుకునే సోయి ఈ ముఖ్యమంత్రికి ఏదీ?’ అని దుయ్యబట్టారు.  ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ)ను పూర్తి చేసి పాలమూరు ప్రాంతంలో సాగునీటి విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఘనపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాళ్లకు జీవోలు తీసుకురావడంతోపాటు వాటి పనులు పూర్తి చేయించడంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆయన తెలిపారు.  

కరువు అని చెప్పడం తప్ప ఆదుకునే పద్ధతేది?

‘కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రకటించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదు.. పంటలు నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయిన రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. యాసంగి రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఆర్థిక సాయం అందించే చర్యలు చేపడుతున్నారని, తెలంగాణలో మాత్రం రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు.  

రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాటం 

కరోనా సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు కరువు అని చెప్తున్న ప్రభుత్వం.. రైతులకు ఎలాంటి సాయమూ చేయడం లేదని మండిపడ్డారు. ‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించి, అవసరమైన నిధులు సాధించాలి. ఇతర రాష్ట్రాల్లో పంట నష్టాలపై కేంద్ర బృందాలు పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణలోనూ అలాంటి చర్యలు తీసుకునేలా కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ‘రైతులు ధైర్యం కోల్పోవద్దు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుంది. పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం, యాసంగి రైతుబంధు విడుదల, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కూలీలకు ఉపాధి వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, అల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు